AI జనరేటెడ్‌ వీడియోలు గుర్తించడం ఇకపై సులువు.. యూట్యూబ్‌ కొత్త రూల్స్‌

YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. వీటి సాయంతో యూజర్లు సులభంగా ఏఐ కంటెంట్‌, వాస్తవిక వీడియోల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది.

Published : 20 Mar 2024 20:52 IST

YouTube | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI).. ఎక్కడ చూసినా దీనిదే హవా. ప్రతీ రంగంలోనూ ఏఐ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. దీని సాయంతోనే కంటెంట్‌ క్రియేటర్లు వీడియోలు రూపొందిస్తున్నారు. తమ ఫాలోవర్లను ఆకట్టుకోవడంలో భాగంగా లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు. దీంతో ఏది నిజమైన వీడియోనో.. ఏది ఏఐ సాయంతో రూపొందించిన వీడియోనో తెలుసుకోలేక తికమకపడుతున్నారు. దీనికి చెక్‌పెట్టేందుకు వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

తన ప్లాట్‌ఫామ్‌లో కొత్త రూల్స్‌ తీసుకొచ్చినట్లు యూట్యూబ్‌ బ్లాగ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. ‘‘యూజర్లకు వాస్తవిక కంటెంట్‌కు, ఏఐతో రూపొందించిన వీడియో మధ్య వ్యత్యాసాన్ని తెలపాల్సిన అవసరం ఉంది. దాని కోసమే క్రియేటర్ స్టూడియోలో కొత్త టూల్‌ని పరిచయం చేస్తున్నాం. వ్యక్తులు, స్థలాలు, దృశ్యాలను ఏఐ ద్వారా క్రియేట్‌ చేస్తే ఆ విషయాన్ని ఛానెల్‌ నిర్వహిస్తున్న వ్యక్తులు తెలపాల్సి ఉంటుంది. అదే స్పెషల్‌ ఎఫెక్ట్‌లు ఉపయోగించి ఎడిట్‌ చేసిన కంటెంట్‌కు ఏఐ ప్రత్యేక లేబుల్‌ పెట్టాల్సిన అవసరం లేదు’’ అని యూట్యూబ్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది.

త్వరలో వాట్సప్‌ స్టేటస్‌లో నిమిషం వీడియో!

యూట్యూబ్‌ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. ఇకపై వీడియోలకు మరింత హంగు జోడించేందుకు ఏఐని వినియోగిస్తుంటే ఆ విషయాన్ని కచ్చితంగా వీక్షకులకు చెప్పాల్సి ఉంటుంది. ముఖాలు మార్చడం, ఏఐని ఉపయోగించి రియల్‌ ఫొటోల్లా సృష్టించడం లాంటివి చేస్తే వీక్షకులకు తెలియజేయాలి. వీడియో ప్లేయర్‌లోనే ఆ విషయం కనిపిస్తుంది.  వీడియో డిస్క్రిప్షన్‌ బాక్స్‌లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ముఖ్యంగా ఆరోగ్యం, వార్తలకు సంబంధించిన వీడియోల విషయంలో మరింత సులువుగా గుర్తించేలా ఏఐ వినియోగించిన విషయాన్ని జోడించాల్సి ఉంటుంది. ముందుగా ఈ లేబల్‌ నిబంధనలు మొబైల్‌ఫోన్లలో తీసుకురానుంది. ఆ తర్వాత డెస్క్‌టాప్‌, టీవీల్లో రోలవుట్‌ చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని