EPF Withdraw: పీఎఫ్‌లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్‌డ్రా

EPF Withdraw: నగదు ఉపసంహరణలో ఈపీఎఫ్‌వో కీలక మార్పు చేసింది. ఇకపై చందాదారులు వైద్య చికిత్స కోసం రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Published : 17 Apr 2024 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించినదే అయినా.. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా (EPF Withdraw) చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్‌ నుంచి కొంత మొత్తంలో నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. తాజాగా ఇందులో ఈపీఎఫ్‌వో (EPFO) కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్‌ పరిమితిని ఈపీఎఫ్‌ఓ రెట్టింపు చేసింది.

ఈ విషయాన్ని ఈపీఎఫ్‌ఓ ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది. ‘‘పేరా 68జె కింద ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచుతున్నాం’’ అని వెల్లడించింది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈ పేరా కింద ఈపీఎఫ్‌ డబ్బులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం

నెల అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా.. శస్త్రచికిత్సలు చేయించుకున్నా ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్‌, హృద్రోగ చికిత్సల కోసమూ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి మెడికల్‌ సర్టిఫికెట్లు లేకుండానే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సమర్పించి దీన్ని పొందొచ్చు. అయితే, ఉద్యోగి ఆరు నెలల బేసిక్‌ ప్లస్‌ డీఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా (వడ్డీ సహా).. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి వీలుటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని