Market Updates: ఎక్సికామ్‌ బిగ్‌ ఎంట్రీ.. టాటా మోటార్స్‌ షేర్ల పరుగు

Market Updates: స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈరోజు రెండు కంపెనీల షేర్లు లిస్టయ్యాయి. మరోవైపు టాటా మోటార్స్‌ షేర్లు 52 వారాల గరిష్ఠానికి చేరగా.. ఐఐఎఫ్‌ల్‌ ఫైనాన్స్‌ షేర్లు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Published : 05 Mar 2024 13:34 IST

దిల్లీ: విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ మౌలిక వసతుల కల్పన సంస్థ ఎక్సికామ్‌ టెలీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (Exicom Tele Systems Listing) షేర్లు మంగళవారం తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.142తో పోలిస్తే బీఎస్‌ఈలో 85.91 శాతం లాభంతో రూ.264 వద్ద లిస్టయ్యింది. ఎన్‌ఎస్‌ఈలో 86.61 శాతం పెరిగి రూ.265 దగ్గర ట్రేడింగ్‌ మొదలు పెట్టింది. ఐపీఓలో మదుపర్లు రూ.14,200తో కనీసం 100 షేర్లను కొనుగోలు చేశారు. దీంతో షేర్లు దక్కించుకున్నవారు లిస్టింగ్‌లో ఒక్కో లాట్‌పై రూ.12,200 లాభం పొందారు.

రూ.429 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎక్సికామ్‌ టెలీ సిస్టమ్స్‌ లిమిటెడ్ ఐపీఓ ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు జరిగింది. దాదాపు 129 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. షేరు ధరల శ్రేణిని 135-142 మధ్య నిర్ణయించారు. రూ.329 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు రూ.100 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచారు. ఛార్జింగ్‌, పవర్‌ సొల్యూషన్స్‌.. రెండు విభాగాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

33% లాభంతో ప్లాటినం ఇండస్ట్రీస్‌ లిస్టింగ్‌

ప్లాటినం ఇండస్ట్రీస్‌ షేర్లు సైతం ఈరోజే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అరంగేట్రం చేశాయి (Platinum Industries Listing). ఇష్యూ ధర రూ.171తో పోలిస్తే బీఎస్‌ఈలో 33.33 శాతం లాభంతో రూ.228 దగ్గర, ఎన్‌ఎస్‌ఈలో 31.57 శాతం పుంజుకొని రూ.225 వద్ద లిస్టయ్యింది. రూ.235 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీఓ ఫిబ్రవరి 27, 28, 29 తేదీల్లో జరిగింది. మొత్తం 98.99 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

52 వారాల గరిష్ఠానికి టాటా మోటార్స్‌ షేర్లు

టాటా మోటార్స్‌ షేరు విలువ (Tata Motors shares) మంగళవారం ఆరంభంలో దాదాపు ఎనిమిది శాతం పెరిగి రూ.1,065 దగ్గర 52 వారాల గరిష్ఠానికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.12,601 కోట్లు ఎగబాకి రూ.3,40,633.29 కోట్లకు చేరింది. టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించాలనే ప్రతిపాదనకు సోమవారం బోర్డు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు షేర్లు రాణిస్తున్నాయి.

వాణిజ్య వాహనాల వ్యాపారం, దాని సంబంధిత పెట్టుబడులు ఒక సంస్థగా; ప్రయాణికుల వాహనాల (PVs) వ్యాపారాలు, విద్యుత్‌ వాహనాలు (Electric Vehicles- EV), జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌, దాని సంబంధిత పెట్టుబడులు మరొక సంస్థగా విడదీయాలనుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్‌ సమాచారమిచ్చింది. టాటా మోటార్స్‌ వాటాదార్లందరికీ ఈ రెండు నమోదిత సంస్థల్లో షేర్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది.

ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ షేర్లు ఢమాల్‌..

ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు (IIFL Finance shares) మంగళవారం 20 శాతానికి పైగా కుంగి బీఎస్‌ఈలో రూ.478.50 దగ్గర లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,552.85 కోట్లు తగ్గి రూ.18,253.97 కోట్లకు చేరింది.

పసిడి రుణాలు ఇవ్వకూడదంటూ ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌పై ఆర్‌బీఐ సోమవారం ఆంక్షలు విధించింది. పసిడి శుద్ధతను పరీక్షించడం, లోడ్‌- టు- వ్యాల్యూ నిష్పత్తిలో ఉల్లంఘనలు, పసిడి రుణ మంజూరు, వేలం సమయంలో నికర బరువును లెక్కించడంలో లోపాలు, వేలం నిర్వహణలోనూ నిబంధనలు పాటించకపోవడం, వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీల్లో పారదర్శకత లేకపోవడం వంటి లోపాలు గుర్తించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని