Flipkart: ఐఫోన్‌ ఆర్డర్‌ క్యాన్సిల్‌.. ఫ్లిప్‌కార్ట్‌కు రూ.10,000 జరిమానా!

Flipkart: ఐఫోన్‌ ఆర్డర్‌ను ఏకపక్షంగా క్యాన్సిల్‌ చేయడం వల్ల కస్టమర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని.. అందుకు ఫ్లిప్‌కార్ట్‌ రూ.10,000 జరిమానా చెల్లించాలని సెంట్రల్‌ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌’ ఆదేశించింది.

Published : 18 Mar 2024 00:09 IST

ముంబయి: ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) సెంట్రల్‌ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌’ రూ.10,000 జరిమానా విధించింది. ఓ కస్టమర్‌ ఆర్డర్‌ను అతని అనుమతి లేకుండా క్యాన్సిల్‌ చేసిందని తెలిపింది. అదనపు లాభం కోసమే ఈ - కామర్స్ సంస్థ అలా చేసిందని తేల్చింది. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లించాల్సిందేనని తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే.. దాదర్‌కు చెందిన ఓ వ్యక్తి 2022 జులై 10న క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.39,628కు ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఐఫోన్‌ ఆర్డర్‌ చేశారు. జులై 12కల్లా ఫోన్‌ను వారికి అందజేయాల్సింది. కానీ, ఆరు రోజుల తర్వాత ఆర్డర్‌ క్యాన్సిల్‌ అయినట్లు ఎసెమ్మెస్‌ వచ్చింది. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ను సంప్రదించగా.. తమ ఈకార్ట్‌ ప్రతినిధి పలుమార్లు ఫోన్‌ను డెలివరీ చేయడానికి యత్నించినా కస్టమర్‌ అందుబాటులో లేరని తెలిపింది.

దీంతో కస్టమర్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) తన ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు. ఇది ఆన్‌లైన్‌ మోసం కిందకూ వస్తుందని తెలిపారు. దీంట్లో ఈకార్ట్‌ సంస్థనూ బాధ్యులుగా చేర్చారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ను కమిషన్‌ వివరణ కోరగా.. తమది కేవలం ఆన్‌లైన్ వేదిక మాత్రమేనని సమర్థించుకుంది. కొనుగోలు పూర్తిగా కస్టమర్‌, విక్రేతల మధ్య జరిగిన ఒప్పందమని.. దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ కేసులో విక్రేత ఇంటర్నేషనల్‌ వాల్యూ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అని తెలిపింది. చెల్లించిన డబ్బును తిరిగిచ్చేశామని.. ఇక వివాదం విక్రేత, కస్టమర్‌ మధ్యే ఉందని సమర్థించుకుంది. విషయాన్ని ఇంటర్నేషనల్‌ వాల్యూ రిటైల్‌కు తెలియజేశామని పేర్కొంది.

సింగిల్‌ క్లిక్‌తో ఆధార్‌ హిస్టరీ.. ఎలా చూడాలంటే?

దీనిపై విచారణ చేపట్టిన కమిషన్‌.. ఆర్డర్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఏకపక్షంగా క్యాన్సిల్‌ చేసిందని తేల్చింది. పైగా అప్పటికే కస్టమర్‌ ఈ - కామర్స్‌ సంస్థతో నిరంతర సంప్రదింపులో ఉన్నారని తెలిపింది. ఆ సమయంలోనే ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసినట్లు తెలిపింది. పైగా డెలివరీ చేయడానికి యత్నించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. మరోవైపు సమస్యను పరిష్కరిస్తున్నట్లు కస్టమర్‌కు తెలియజేసినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా బాధ్యత ఫ్లిప్‌కార్ట్‌దేనని తేల్చింది. రిఫండ్‌ చేసి మరోసారి కొత్తగా ఫోన్‌ ఆర్డర్‌ చేసుకోవాలని సూచించినా.. అప్పటికే ధర రూ.7,000 పెరిగిందని గుర్తు చేసింది. ఇది పూర్తిగా కస్టమర్‌ను మనోవేదనకు గురి చేయడమేనని తేల్చింది. అదనపు లాభం కోసమే ఇలాంటి అక్రమ విధానాలను అవలంబించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.10,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని