Banking Laws Amendment Bill: బ్యాంక్‌ ఖాతాలో నలుగురు నామినీలు

Eenadu icon
By Business News Desk Published : 27 Mar 2025 03:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

దిల్లీ: బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు నలుగురు వరకు నామినీలను నియమించుకునేందుకు అవకాశం కల్పించే బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లు, 2024ను పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ బిల్లును గత డిసెంబరులో లోక్‌ సభ ఆమోదించగా, రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. నగదు డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సమయంలోనే నామినేషన్‌ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. లాకర్ల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇప్పటికే బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాల్లో ఈ విధానం అమల్లో ఉంది. 

సబ్‌స్టాన్షియల్‌ ఇంటరెస్ట్‌ పరిమితి పెంపు

‘సబ్‌స్టాన్షియల్‌ ఇంటరెస్ట్‌’ పరిమితిని ఒక వ్యక్తికి  రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. రూ.5 లక్షల పరిమితిని 6 దశాబ్దాల క్రితం నిర్ణయించారు. ఒక బ్యాంక్‌ వాటా మూలధనంలో 10 శాతానికి సమానమైన (అప్పట్లో గరిష్ఠ విలువ రూ.5 లక్షలు) వాటా కలిగిన వ్యక్తి- కుటుంబాన్ని  సబ్‌స్టాన్షియల్‌ ఇంటరెస్ట్‌ కలిగిన వారుగా లెక్కిస్తారు. వీరికి రుణాల మంజూరులో కొన్ని అదనపు నిబంధనలుంటాయి. ప్రస్తుత విలువలను పరిగణనలోకి తీసుకుని, ఈ మొత్తాన్ని పెంచారు. 

ఎగవేతదార్లపై కఠిన చర్యలే

రాజ్యసభలో ఈ బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిస్తూ బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) గణనీయంగా తగ్గినా, ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అయిదేళ్లలో బ్యాంకు మోసాలకు సంబంధించి 912 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేపట్టిందని, ఇందులో కొన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించినవీ ఉన్నాయని వెల్లడించారు.

వసూలు ప్రక్రియ ఆగదు: ‘రైట్‌-ఆఫ్‌’ అంటే రుణాలను మాఫీ చేయడం కాదని ఆమె స్పష్టం చేశారు. సంబంధితుల నుంచి ఆ నిధులను వసూలు చేసే ప్రయత్నాలను బ్యాంకులు కొనసాగిస్తాయని మంత్రి తెలిపారు. 


యూపీఐ లావాదేవీల్లో అంతరాయం

దిల్లీ: దేశీయంగా యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) సేవల్లో బుధవారం దాదాపు గంటసేపు అంతరాయం కలిగింది. చెల్లింపులు జరపలేక ఇబ్బంది పడ్డామని వేలమంది ఖాతాదారులు తెలిపారు. డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌లైన గూగుల్‌ పే, ఫోన్‌పే వినియోగదారులు ఇబ్బంది పడిన వారిలో ఉన్నారు. అరుదుగా తలెత్తే సాంకేతిక లోపాల వల్లే ఇలా జరిగిందని, ఇప్పుడు యూపీఐ లావాదేవీలు యథాతథంగా జరుగుతున్నట్లు నిర్వహణ సంస్థ ఎన్‌పీసీఐ వివరించింది. 


31న బ్యాంకులు పనిచేస్తాయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ముగింపు రోజైన మార్చి 31న అన్ని బ్యాంకులూ పనిచేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. రంజాన్‌ పండుగ కావడంతో వచ్చే సోమవారం చాలా రాష్ట్రాల్లో సెలవు రోజుగా ప్రకటించారు. అయినా, ప్రభుత్వ లావాదేవీలను సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా ఆ రోజున బ్యాంకులు పనిచేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31 (సోమవారం)న ప్రభుత్వ ఆదాయాలు, ఇతర లెక్కలను కచ్చితంగా నమోదు చేయాలి. అందువల్ల ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించే అన్ని బ్యాంకులూ ఆ రోజున సాధారణ పని గంటల్లో పనిచేయాలని ఆర్‌బీఐ తెలిపింది. ఆన్‌లైన్, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. వార్షిక ఖాతాల ముగింపు నేపథ్యంలో ఏప్రిల్‌ 1న బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు