ఇండస్‌ఇండ్‌ నష్టం రూ.2,329 కోట్లు

Eenadu icon
By Business News Desk Published : 22 May 2025 02:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అధిక కేటాయింపుల వల్లే

దిల్లీ: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత పద్ధతిలో రూ.2,328.90 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2023-24 ఇదే కాలంలో రూ.2,349.15 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్‌ ఆర్జించింది. ఆదాయం తగ్గడం, కేటాయింపులు పెరగడమే ఈసారి నష్టాలకు కారణం. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రూ.2,522 కోట్లను కేటాయింపులుగా చేసింది. 2023-24 జనవరి- మార్చిలో ఇవి రూ.950 కోట్లుగా ఉన్నాయి. వడ్డీ ఆదాయం రూ.12,199 కోట్ల నుంచి 13% తగ్గి రూ.10,634 కోట్లకు పరిమితమైంది. 

పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2024-25) ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నికర లాభం రూ.2,576 కోట్లకు పరిమితమైంది. 2023-24 లాభం రూ.8,977 కోట్ల కంటే ఇది 71% తక్కువ. మొత్తం కేటాయింపులు  రూ.3,885 కోట్ల నుంచి రూ.7,136 కోట్లకు పెరిగాయి. 

అకౌంటింగ్‌ లోపాల మూల్యం రూ.1,979 కోట్లు: డెరివేటివ్‌ విభాగంలో అకౌంటింగ్‌ లోపాలు చోటుచేసుకున్నట్లు మార్చిలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ పరిణామం 2024 డిసెంబరు నాటికి బ్యాంకుకు ఉన్న నికర విలువపై సుమారు 2.35% ప్రతికూల ప్రభావం చూపించొచ్చని అంచనా వేశారు. బ్యాలెన్స్‌ షీట్‌పై ఈ అకౌంటింగ్‌ లోపాల ప్రభావాన్ని మదింపు చేసేందుకు, వివిధ స్థాయిల్లో లోపాలను గుర్తించేందుకు, పరిష్కార చర్యలను సూచించేందుకు పీడబ్ల్యూసీ సంస్థను ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నియమించింది. అకౌంటింగ్‌ లోపాల వల్ల 2024 జూన్‌ 30 నాటికి బ్యాంకుకు రూ.1,979 కోట్ల మేర నష్టం కలిగినట్లు గుర్తించినట్లు పీడబ్ల్యూసీ తన నివేదికలో తెలిపింది. 

బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్‌లో ‘అదర్‌ అసెట్స్‌’ కింద రూ.595 కోట్ల నగదు నిల్వలను అంతర్గత ఆడిట్‌ విభాగం (ఐఏడీ) గుర్తించింది. సూక్ష్మ రుణాల విభాగంలోనూ.. 2024-25లో 3 త్రైమాసికాల పాటు వడ్డీ కింద రూ.674 కోట్లను తప్పుగా చూపించినట్లు గుర్తించింది. 

ఉద్యోగుల పాత్రపై అనుమానం..: డెరివేటివ్స్, సూక్ష్మ రుణాలు, బ్యాలెన్స్‌ షీట్‌కు సంబంధించి వెలుగుచూసిన మోసాల్లో కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ బోర్డు అనుమానిస్తోంది. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలు, నియంత్రణ సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని బ్యాంకుకు బోర్డు సూచించింది. ‘హోదాలు, బాధ్యతల మదింపుపై అవసరమైన చర్యలు చేపట్టే ప్రక్రియలో ఉన్నాం. లోపాలకు కారణమైన వ్యక్తులను జవాబుదారీ చేయనున్నాం. చట్టాలకు లోబడి ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు బ్యాంకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంద’ని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. 

బుధవారం బీఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 1.39% నష్టంతో రూ.771.10 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు