యాపిల్‌ కొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌

టెక్‌ దిగ్గజం యాపిల్‌ సరికొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ను మంగళవారం జరిగిన ‘లెట్‌ లూజ్‌’ కార్యక్రమంలో ఆవిష్కరించింది.

Updated : 08 May 2024 11:59 IST

ధర రూ.59,900 నుంచి

దిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ సరికొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ను మంగళవారం జరిగిన ‘లెట్‌ లూజ్‌’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఇందులో శక్తిమంత ఎం2 చిప్‌ను అమర్చారు. తొలిసారిగా ఐప్యాడ్‌ ఎయిర్‌ను రెండు సైజులు- 11 అంగుళాలు, 13 అంగుళాల తెరలతో కంపెనీ తీసుకొచ్చింది. బ్లూ, పర్పుల్‌, స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే రంగుల్లో 128జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ నిల్వ సామర్థ్యాలతో కొత్త ఐప్యాడ్‌ లభించనుంది. 11 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌) ధర రూ.59,900, వైఫై+సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.74,900గా నిర్ణయించారు. 13 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌) ధర రూ.79,900, వైఫై+సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.94,900గా ఉన్నాయి. యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో వినియోగదారులు కొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ను ఆర్డరు చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి వినియోగదారులు ఇవి అందుబాటులోకి వస్తాయి.

  • ఐప్యాడ్‌ ఎయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఎం2 ప్రాసెసర్‌ నిలుస్తోంది. సులభంగా మల్టీటాస్కింగ్‌ చేసేందుకు ఎం2 దోహదపడుతుందని కంపెనీ తెలిపింది.
  • వైఫై 6ఈ కనెక్టివిటీ, యాపిల్‌ పెన్సిల్‌ హోవర్‌ వంటి ఫీచర్లూ ఉన్నాయి.

ఏఐ చిప్‌లపై యాపిల్‌ దృష్టి: డేటా కేంద్రాల్లో కృత్రిమ మేధ (ఏఐ) సాఫ్ట్‌వేర్‌ను నడిపించేందుకు సొంత చిప్‌లను యాపిల్‌ అభివృద్ధి చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. చిప్‌ల అభివృద్ధికి ప్రాజెక్ట్‌ ఏసీడీసీ (యాపిల్‌ చిప్స్‌ ఇన్‌ డేటా సెంటర్‌) పనిచేస్తోందని వెల్లడించింది. సర్వర్‌ మౌలిక సదుపాయాల్లో యాపిల్‌ చిప్‌ డిజైన్‌ నైపుణ్యాలను ఇది పెంచుతుందని కంపెనీ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని