Ghazal Alagh: ‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్‌ సీఈఓ భావోద్వేగ పోస్ట్‌

Ghazal Alagh: కెరియర్‌ టిప్స్‌ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్‌గా ఉండే మామాఎర్త్‌ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్‌ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు.

Published : 18 Apr 2024 00:04 IST

Ghazal Alagh | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆధునిక ప్రపంచంలో ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంలో భార్యాభర్తలిద్దరూ తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు ఇంటిని చూసుకుంటూ మరోవైపు ఉద్యోగం చేస్తున్నారు. ఇలా రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడం చాలా కష్టం. అయితే ఇలా ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు ఎదురయ్యే కష్టం గురించి బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్‌ (Mamaearth) సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్‌ (Ghazal Alagh) ఓ భావోద్వేగమైన పోస్ట్‌ చేశారు.

‘‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు నా మదిలో మెదిలిన ప్రశ్న ఇది. నేను మంచి తల్లిని కాదా? ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్‌కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదరదు. అలా మొదటిరోజు స్కూల్‌కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని లింక్డిన్‌ (LinkedIn) వేదికగా పంచుకున్నారు.

యంగ్‌ ఇండియాది విరాట్‌ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్‌ రాజన్‌

ఈసందర్భంగా ఉమ్మడి కుటుంబం ప్రాధాన్యాన్ని ఇదే పోస్ట్‌లో వివరించారు. ‘‘నా కోసం నేను సృష్టించుకున్న సపోర్ట్‌ సిస్టమ్‌.. మా అత్త. ఐదేళ్ల క్రితం నేను, వరుణ్ అలఘ్‌, కుమారుడు అగస్త్య ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నాలుగుతరాల వాళ్లంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చని నాకు తెలుసు. సొంతవాళ్లే కావాలనేం లేదు. దగ్గరి బంధువులు, అర్థం చేసుకునే స్నేహితులున్నా పర్లేదు. అయితే, ప్రతీ విషయంలోనూ లాభాలు, నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణం. తల్లులు కెరీర్‌ లక్ష్యాలను పక్కనపెట్టకుండా.. ప్రేమ, రక్షణ అందించే ప్రదేశం’’ అంటూ సుదీర్ఘ మైన పోస్ట్‌ రాసుకొచ్చారు. 

‘‘ఒకవేళ మీరు కూడా వర్కింగ్‌ పేరెంట్‌ అయితే... జీవిత భాగస్వామి కాకుండా మీకున్న మరో సపోర్ట్‌ సిస్టమ్‌ గురించి చెప్పండి ’’.. అంటూ లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై చాలామంది వర్కింగ్‌ పేరెంట్స్‌ స్పందించారు. ‘కుమారుడికి సానుకూల వాతావరణాన్ని కల్పించడంలో మీ అంకితభావం చాలా గొప్పది. మీరు వండర్‌ఫుల్‌ మదర్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని