Go Digit listing: గో డిజిట్‌ లిస్టింగ్‌: విరుష్క జోడీకి జాక్‌పాట్‌.. పెట్టుబడి నాలుగింతలు

Go Digit listing: గో డిజిట్‌ కంపెనీ విరుష్క జోడీకి కాసుల వర్షం కురిపించింది. ఆ కంపెనీ లిస్టింగ్‌తో వారి పెట్టుబడులు నాలుగింతలయ్యాయి. 

Published : 23 May 2024 16:28 IST

Go Digit listing | ముంబయి: ఆన్‌లైన్‌ వేదికగా బీమా ఉత్పత్తులను విక్రయించే గో డిజిట్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ (Go Digit listing) స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ.272 కాగా.. రూ.281 వద్ద 3.35 శాతం ప్రీమియంతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇంట్రాడేలో ఇంకాస్త లాభపడింది. గతంలో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు జాక్‌పాట్‌ కొట్టారు. వారు పెట్టిన పెట్టుబడికి నాలుగింతల ప్రతిఫలం లభించింది.

గో డిజిట్‌లో ఒక్కో షేరు రూ.75 చొప్పున విరాట్‌ కోహ్లీ 2020లో రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టారు. అనుష్కశర్మ రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఇద్దరూ కలిపి రూ.2.5 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. లిస్టింగ్‌ తర్వాత గో డిజిట్‌ కంపెనీ షేరు విలువ రూ.300 దాటింది. ఈ లెక్కన వారు పెట్టిన పెట్టుబడికి నాలుగింతల ప్రతిఫలం లభించినట్లయ్యింది. ఐపీఓలో భాగంగా వారు తమ వాటాను విక్రయించలేదు. విరాట్‌ కోహ్లీ ఈ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కొత్త రూల్స్‌.. టెస్ట్‌ కోసం ఆర్‌టీవో ఆఫీసుకు వెళ్లక్కర్లేదు!

ఐపీఓలో భాగంగా గో డిజిట్‌ సంస్థ రూ.1,125 కోట్లు కొత్త షేర్లను, రూ.1,490 కోట్ల షేర్లను ఆఫర్‌ సేల్‌ కింద ఐపీఓలో భాగంగా విక్రయించింది. ఈ నిధులను క్లెయింల సర్దుబాటు, మూలధనం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. సెలబ్రిటీలు పెట్టుబడులు పెట్టిన సంస్థలు లిస్టింగ్‌కు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో సచిన్‌ తెందూల్కర్‌ పెట్టుబడి పెట్టిన ఆజాద్‌ ఇంజినీరింగ్ కూడా లిస్టయ్యింది. కంపెనీలో రూ.114 చొప్పున 4.3 లక్షల షేర్లను ఆయన కొనుగోలు చేశారు. లిస్టింగ్‌ సమయంలో ఒక్కో షేరు రూ.720 వద్ద ట్రేడవ్వడంతో ఒక్కసారిగా ఆయన సంపద ఆరింతలు పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని