Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ కొత్త రూల్స్‌.. టెస్ట్‌ కోసం ఆర్‌టీవో ఆఫీసుకు వెళ్లక్కర్లేదు!

Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇకపై డ్రైవింగ్ టెస్ట్‌ కోసం ఆర్‌టీవో కార్యాయాలకు వెళ్లాల్సిన అసవరం లేదు. డాక్యుమెంటేషన్‌ ప్రక్రియను సైతం కుదించింది.

Updated : 23 May 2024 17:09 IST

Driving License | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇకపై డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌ కోసం ఆర్‌టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అసవరం లేదు. పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లూ సమర్పించక్కర్లేదు. ఈ మేరకు జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ను (Driving License) పొందే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ వీటిని తీసుకొచ్చింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతులు మంజూరు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ వీటి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం లేదు.

కీలక మార్పులివే..

  • ఇకపై డ్రైవింగ్‌ టెస్ట్‌ (Driving Test) కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు (RTO) వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ డ్రైవింగ్‌ స్కూళ్లలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే స్కూళ్లు వారికి ఒక ధ్రువపత్రాన్ని జారీ చేస్తాయి. వాటితో ఆర్‌టీవో కార్యాలయంలో లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. డ్రైవింగ్‌ టెస్ట్‌ను నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ కేంద్రం ప్రైవేట్‌ సంస్థలకు సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. అవి లేని స్కూళ్లలో డ్రైవింగ్‌ నేర్చుకుంటే మాత్రం కచ్చితంగా ఆర్‌టీవోల్లో టెస్ట్‌కు హాజరుకావాల్సిందే.
  • లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే గరిష్ఠంగా రూ.2,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్లు డ్రైవ్‌ చేస్తున్నట్లు గుర్తిస్తే దాదాపు రూ.25,000 వరకు పెనాల్టీ కట్టాలి. పైగా ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తారు. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ మైనర్‌ లైసెన్స్‌కు అనర్హుడవుతాడు.
  • లైసెన్స్‌ (Driving License) దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాల సంఖ్యను కుదించారు. ఇవి వాహనాన్ని బట్టి (ద్విచక్ర, త్రిచక్ర, భారీ వాహనాలు..) వేర్వేరుగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని మాత్రం కేంద్రం మార్చలేదు.
  • వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటంలో భాగంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ వాహనాలను తొలగించాలని నిర్ణయించింది. ఇతర వెహికల్స్‌కు ఉద్గార ప్రమాణాలను పెంచారు. పరోక్షంగా విద్యుత్తు వాహన వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్లైంది.

మారుతీ సుజుకీ విద్యుత్‌ వ్యాగన్‌ఆర్‌ ఇదేనా?

కొత్త నిబంధనల ప్రకారం వివిధ రకాల ఫీజులు..

  • లెర్నర్స్‌ లైసెన్స్‌ - రూ.200
  • లెర్నర్స్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ - రూ.200
  • ఇంటర్నేషనల్‌ లైసెన్స్‌ - రూ.1,000
  • శాశ్వత లైసెన్స్‌ - రూ.200
  • శాశ్వత లైసెన్స్‌ రెన్యువల్‌ - రూ.200
  • రెన్యువల్‌ చేసిన డ్రైవర్‌ లైసెన్స్‌ జారీ - రూ.200
  • లైసెన్స్‌ వివరాల్లో మార్పులు - రూ.200

ప్రైవేట్‌ డ్రైవింగ్ స్కూళ్లకు మార్గదర్శకాలు..

  • డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలకు కనీసం ఒక ఎకరం స్థలం ఉండాలి. పెద్ద వాహనాల శిక్షణకైతే రెండు ఎకరాలు.
  • స్కూళ్లలో డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహణకు సంబంధించిన వసతులు తప్పనిసరి.
  • శిక్షణనిచ్చేవాళ్లకు కనీసం హైస్కూల్‌ డిప్లొమా (సమానమైన అర్హత) ఉండాలి. డ్రైవింగ్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. బయోమెట్రిక్స్‌ సహా ఐటీ సిస్టమ్స్‌పై అవగాహన అవసరం.
  • లైట్‌ మోటార్‌ వాహనాలకు గరిష్ఠంగా నాలుగువారాల్లో 29 గంటల శిక్షణనివ్వాలి. 21 గంటలు ప్రాక్టికల్‌, 9 గంటలు థియరీ సెషన్‌గా విభజించారు. మీడియం, హెవీ వెహికల్స్‌కు అయితే ఆరు వారాల్లో కనీసం 38 (31 + 8) గంటల శిక్షణ అందించాలి.
  • ట్రైనింగ్‌ ఇవ్వకుండా లైసెన్స్‌ జారీ లేదా రెన్యువల్‌ చేస్తే డ్రైవింగ్‌ స్కూళ్లు రూ.5,000 ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని