Gold price: మరింత పెరిగిన బంగారం ధర.. రూ.75 వేల పైకి!

Gold price: బంగారం ధర మళ్లీ పెరిగింది. కొత్త గరిష్ఠాలను చేరింది. తాజాగా రూ.75 వేల మార్కునూ దాటింది.

Published : 12 Apr 2024 19:25 IST

Gold price | దిల్లీ: బంగారం ధర (Gold price) మళ్లీ పెరిగింది. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధర.. ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్ఠాలను దాటుకుంటూ ముందుకుపోతోంది. తాజాగా రూ.75 వేల మార్కును దాటింది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయానికి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్ల) ధర రూ.75,550గా (అన్ని ట్యాక్సులూ కలుపుకొని) నమోదైంది. ఒక్క రోజులోనే దాదాపు వెయ్యి రూపాయల మేర బంగారం ధర పెరగడం గమనార్హం.

అంతర్జాతీయంగా బంగారానికి గిరాకీ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని, ఫలితంగా దేశీయంగానూ పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 2,388 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక్క బంగారమే కాదు.. వెండి ధర సైతం భారీగా పెరిగింది. దిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో కిలో వెండి శుక్రవారం రూ.1400 మేర పెరిగి రూ.86,300కు చేరింది.

‘ఇజ్రాయెల్‌, ఇరాన్‌లకు వెళ్లొద్దు’.. భారత పౌరులకు విదేశాంగశాఖ అలెర్ట్‌

ఎందుకీ పెరుగుదల?

అంతర్జాతీయంగా ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలు బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అందుక్కారణమయ్యాయి. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఎప్పుడైనా ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై దాడి చేయొచ్చన్న వార్తలు ఇందుకు నేపథ్యం. అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపరులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతుంటారు. తాజా పరిస్థితులు మరోసారి బంగారానికి డిమాండ్‌ పెంచాయి. యూకే, జర్మనీ, చైనా వంటి దేశాల నుంచి త్వరలో వెలువడే గణాంకాలు వీటి ధరలను నిర్దేశించనున్నాయని అనలిస్టులు భావిస్తున్నారు.

గమనిక: బంగారం ధరల్లో ప్రాంతానికి ప్రాంతానికీ మధ్య వ్యత్యాసం ఉంటుంది. వాస్తవ ధరల కోసం మీ దగ్గర్లోని బంగారం వర్తకుల్ని సంప్రదించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని