Gemini: ‘జెమిని’లో కొత్త ఫీచర్‌.. సమాధానంలో మార్పులు చేసుకునేలా!

Gemini: గూగుల్‌ ఏఐ చాట్‌బాట్‌లో కొత్త ఫీచర్‌ వచ్చింది. ఇచ్చిన సమాధానంలో కొంత భాగాన్ని మనకు కావాల్సిన విధంగా మార్చుకునేలా దీన్ని రూపొందించారు.

Updated : 08 Mar 2024 14:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ తమ కృత్రిమ మేధ చాట్‌బాట్‌ జెమిని (Gemini)లో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. ప్రాంప్ట్‌లకు అనుగుణంగా అది ఇచ్చే సమాధానాల్లో స్వల్ప మార్పులు చేసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించింది. టెక్ట్స్‌లోని నిర్దిష్ట భాగాన్ని ఎంచుకొని దాన్ని మార్చడం, తొలగించడం వంటివి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ వెబ్‌ వెర్షన్‌, ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

‘‘జెమిని సమాధానాలను మరింత మెరుగుపర్చడానికి ఓ నిర్దిష్టమైన మార్గాన్ని ప్రవేశపెడుతున్నాం. జెమిని వెబ్ వెర్షన్‌లో ఇంగ్లిష్‌తో దీన్ని ప్రారంభిస్తున్నాం. మార్చాలనుకుంటున్న టెక్స్ట్ భాగాన్ని ఎంచుకొని.. కావాల్సిన విధంగా సూచనలు ఇవ్వాలి. మీరు వెతుకుతున్న దానికి దగ్గరగా ఉండే అవుట్‌పుట్‌ అందుతుంది’’ అని గూగుల్‌ ఓ బ్లాగ్‌ పోస్టులో వెల్లడించింది. ఆశించిన సమాధానం రానప్పుడు టెక్ట్స్‌ మొత్తాన్ని తిరిగి పొందడానికి బదులు కావాల్సిన చోట మార్పులు చేస్తే సరిపోతుందని తెలిపింది.

ప్రాంప్ట్‌కు అనుగుణంగా సమాధానం వచ్చిన తర్వాత యూజర్లు టెక్స్ట్‌లోని ఏదైనా భాగాన్ని ఎంచుకోవచ్చు. దాన్ని హైలైట్ చేస్తే సర్కిల్‌లో పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది. దాని పక్కనే జెమిని లోగో కూడా ఉంటుంది. దానిపై యారో మార్క్‌ను ఉంచితే సవరించు అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే- రీజనరేట్, షార్ట్, లాంగర్‌, రిమూవ్ అనే నాలుగు ఆప్షన్లు ఉంటాయి. పేరుకు తగ్గట్లుగానే రీజనరేట్‌.. ఎంచుకున్న టెక్ట్స్‌ మొత్తాన్ని మార్చి మరోరూపంలో మన ముందుంచుతుంది. షార్ట్‌, లాంగర్‌.. టెక్ట్స్‌ పొడవును సవరిస్తాయి. అలాగే రిమూవ్‌ను ఎంచుకుంటే ఆ భాగం మొత్తం పూర్తిగా తొలగిపోతుంది.

ఏఐ చాట్‌బాట్‌ సమాధానాలు గొప్పగా ఉన్నప్పటికీ.. కొంత భాగం వల్ల దాన్ని పూర్తిగా రీజనరేట్‌ చేయాల్సిన అవసరం వస్తుంటుంది. దానికి పరిష్కారంగానే జెమినిలో గూగుల్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు