Google Chrome: క్రోమ్‌ అప్‌డేట్‌.. కొత్తగా ఏమేం వచ్చాయంటే!

గూగుల్ క్రోమ్‌ కొత్త వెర్షన్‌లో మూడు కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ మొబైల్‌ వెర్షన్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్‌ కొత్త అప్‌డేట్‌లను విడుదల చేసింది. 

Published : 10 Nov 2023 15:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు బ్రౌజింగ్‌ కోసం గూగుల్ క్రోమ్‌ (Google Chrome)ను ఉపయోగిస్తుంటారు. యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో పాటు ఎప్పటికప్పుడు బ్రౌజర్‌లో కొత్త ఫీచర్‌లను తీసుకొస్తూ.. బగ్స్‌ను ఫిక్స్‌ చేస్తుండటంతో ఎక్కువ మంది ఈ బ్రౌజర్‌ను వాడేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో గూగుల్ కొత్తగా మరికొన్ని ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఒకటి కస్టమైజేషన్‌ ఫీచర్‌ కాగా..  ప్రొడక్టివిటీకి సంబంధించినవి రెండు ఉన్నాయి. మరి, వాటిని క్రోమ్‌లో ఏ విధంగా ఎనేబుల్ చేయాలో చూద్దాం. 

క్రోమ్‌ కస్టమైజేషన్

‘కస్టమైజ్‌ క్రోమ్’ (Customize Chrome) ఫీచర్‌తో యూజర్లు తమ బ్రౌజర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌ మార్చుకోవచ్చు. ఇందుకోసం బ్రౌజర్‌లో కొత్త ట్యాబ్ ఓపెన్‌ చేసిన తర్వాత కింద కస్టమైజ్‌ క్రోమ్‌ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే.. కుడివైపు విండోలో వేర్వేరు కలర్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన దానిపై క్లిక్‌ చేస్తే.. ఆ రంగులోకి బ్రౌజర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మారిపోతుంది. గత కొద్ది రోజులుగా పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ఇకపై బుక్‌మార్క్స్‌ వెతకడం సులువే

బ్రౌజింగ్ చేసేప్పుడు ఏదైనా సమాచారానికి సంబంధించిన వెబ్‌పేజీని భవిష్యత్తు అవసరాల కోసం బుక్‌మార్క్‌ చేస్తుంటాం. మనకు అవసరమైనప్పుడు ఆ వెబ్‌పేజీలను సులువుగా వెతికేందుకు వీలుగా క్రోమ్‌ బ్రౌజర్‌ సైడ్‌ ప్యానల్‌లో బుక్‌మార్క్‌ ఆప్షన్‌ తీసుకొచ్చింది. దీని కోసం బ్రౌజర్‌ కుడివైపు ‘సైడ్‌ ప్యానల్‌’ (Side Pannel) సింబల్‌పై క్లిక్‌ చేస్తే బుక్‌ మార్క్‌ బార్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే.. మీ బ్రౌజర్‌లో బుక్‌మార్క్‌ చేసిన వెబ్‌పేజీలు వాటి థంబ్‌నెయిల్‌ ఇమేజ్‌లతో జాబితా కనిపిస్తుంది. దాంతో సులువుగా మీకు కావాల్సిన పేజీపై క్లిక్‌ చేసి ఉపయోగించుకోవచ్చు. 

క్రోమ్‌ ప్రొఫైల్‌ కొత్తగా..

బ్రౌజర్‌లో యూజర్‌ ప్రొఫైల్‌కు మరిన్ని ఫీచర్లు జోడించారు. గతంలో బ్రౌజర్‌లో కనిపించే ప్రొఫైల్‌ ఐకాన్‌పై క్లిక్ చేయగానే.. మేనేజ్‌ అకౌంట్‌, ప్రొఫైల్‌ ఛేంజ్‌ ఆప్షన్లు మాత్రమే కనిపించేవి. కొత్త అప్‌డేట్‌లో బ్రౌజర్‌ మెనూలో ప్రొఫైల్‌ ఐకాన్‌పై క్లిక్ చేయగానే.. న్యూ ట్యాబ్‌, న్యూ విండో, ఇన్‌కాగ్నిటో మోడ్‌, పాస్‌వర్డ్‌ ఆటోఫిల్‌, హిస్టరీ, ప్రొఫైల్ ఛేంజ్‌, క్రోమ్‌ కస్టమైజ్‌ ఆప్షన్లను జోడించారు. ఈ ఫీచర్స్‌ కోసం గూగుల్ క్రోమ్‌ వెర్షన్‌ 119.0.6045.124ను అప్‌డేట్ చేయాలి. ప్రస్తుతం వీటిలో బుక్‌మార్క్స్‌, క్రోమ్‌ ప్రొఫైల్‌ ఫీచర్లు కొద్దిమంది యూజర్లకు మాత్రమే అప్‌డేట్ అయ్యాయి. త్వరలో పూర్తిస్థాయి యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. 

ఫైర్‌ఫాక్స్‌ కొత్త వెర్షన్‌

మొబైల్‌ బ్రౌజింగ్‌ వినియోగాన్ని మరింత మెరుగుపరిచేందుకు మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ కొత్తగా ఫైర్‌ఫాక్స్‌ వెర్షన్‌ 120ను యూజర్లకు పరిచయం చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 200కు పైగా కొత్త మొబైల్‌ ఎక్స్‌టెన్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు డెస్క్‌టాప్‌ వెర్షన్‌ 119ను కూడా విడుదల చేసింది. ఇందులో పీడీఎఫ్‌ ఎడిట్‌ ఫీచర్‌తోపాటు ఇతర డివైజ్‌లలో వెబ్‌ విండోలో ఓపెన్‌ చేసిన అన్ని ట్యాబ్‌లను యూజర్లు చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని