Google Gemini: ‘జెమిని’.. గూగుల్‌ ఏఐ మోడల్‌కు ఆ పేరెలా వచ్చింది?

Google Gemini: గూగుల్‌ తమ ఏఐ మోడల్‌కు జెమిని అనే పేరు ఎందుకు ఎంచుకుందో వివరించింది.

Updated : 22 May 2024 11:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధునాతన సామర్థ్యాలతో కృత్రిమ మేధ మోడళ్లు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. గూగుల్‌ జెమిని (Google Gemini) అందులో ఒకటి. ఇటీవలే దీన్ని మరింత ఆధునికీకరిస్తూ కంపెనీ కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇంతకీ గూగుల్‌ తమ ఏఐ మోడల్‌కు జెమిని అనే పేరు ఎందుకు ఎంచుకొంది?

ఇటీవల ఓ బ్లాగ్‌పోస్ట్‌లో జెమిని అనే పేరు వెనకాల ఉన్న కసరత్తును గూగుల్‌ వివరించింది. ‘‘శనిగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం ‘టైటన్‌’ పేరును తొలుత కొంతమంది సూచించారు. అది అందరికీ ఆకర్షణీయంగా అనిపించలేదు. కానీ, అంతరిక్ష వృత్తాంతంతోనే పేరు ఎంచుకోవాలనే స్ఫూర్తి దాన్నుంచి తీసుకున్నాం’’ అని జెమిని కో-టెక్నికల్‌ లీడ్‌ జెఫ్‌ డీన్‌ వెల్లడించారు.

‘‘ఈ క్రమంలో వివిధ పేర్లను పరిశీలిస్తుండగా జెమిని (Google Gemini) అనే పేరు తెరపైకి వచ్చింది. ఆ పదానికి కవలలు అని అర్థం. ఇది అందరికీ నచ్చింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. శక్తిమంతమైన ఏఐ మోడల్‌ సృష్టి కోసం గూగుల్‌లోని డీప్‌మైండ్‌, బ్రెయిన్‌ పరిశోధన బృందాలను విలీనం చేశాం. ఈ రెండూ సమష్టిగా పనిచేస్తూ గ్రీకు పౌరాణిక కవలలు క్యాస్టర్, పోలక్స్‌తో కూడిన నక్షత్రరాశి జెమినీని ప్రతిబింబించాయి. మరో కారణం.. జ్యోతిషశాస్త్రం ప్రకారం అనుకూలత, వివిధ కోణాల నుంచి విషయాలను విశ్లేషించే సామర్థ్యానికి జెమిని ప్రసిద్ధి. మేం తీసుకురావాలనుకున్న ఏఐ మోడల్‌ పనితీరుకు ఇది దగ్గరగా ఉంది’’ అని బ్లాగ్‌పోస్ట్‌లో గూగుల్‌ వివరించింది.

ఈ పేరును ఖరారు చేయడానికి మరో అంశం కూడా తమకు స్ఫూర్తినిచ్చినట్లు గూగుల్‌ (Google) వెల్లడించింది. చంద్రుడిపై కాలు మోపేందుకు 1960ల్లో నాసా చేపట్టిన ప్రాజెక్టుకు కావాల్సిన సాంకేతికతల ప్రయోగాలను జెమిని పేరిటే నిర్వహించినట్లు గుర్తు చేసింది. ఆ మిషన్‌ అంతరిక్షయాన విప్లవానికి నాంది పలికినట్లే.. ఏఐలోనూ తమ మోడల్‌ కొత్త శకానికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు