Google: నెట్‌వర్క్‌ లేకున్నా ఫోన్‌ కనిపెట్టేయొచ్చు.. ఫైండ్‌ మై డివైజ్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన గూగుల్‌

Google: గూగుల్‌ తన Find My Device ఫీచర్‌ని అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో బ్యాటరీ అయిపోయినా, నెట్‌వర్క్‌ లేకున్నా.. మొబైల్‌ని సులువుగా కనిపెట్టేయొచ్చు.

Published : 09 Apr 2024 15:16 IST

Google | ఇంటర్నెట్‌డెస్క్‌: పోగొట్టుకున్న మొబైల్‌ను కనిపెట్టాలంటే చాలా కష్టం. పొరపాటున ఎవరైనా మన ఫోన్‌ దొంగిలిస్తే దానిపై ఆశలు వదలుకోవాల్సిన పరిస్థితి. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించేందుకు ‘ఫైండ్‌ మై డివైజ్‌’ (Find My Device) లాంటి సదుపాయం ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోయినా, డివైజ్‌ ఆఫ్‌లైన్‌లో ఉన్నా గుర్తించడం కష్టం. ఇలాంటి సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ గూగుల్‌ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన Find My Device సదుపాయాన్ని అప్‌గ్రేడ్‌ చేసింది.

కొత్తగా అప్‌గ్రేడ్‌ చేసిన ఫైండ్‌ మై డివైజ్‌ ఆప్షన్‌లో ఫోన్‌లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్‌ను కనిపెట్టొచ్చు. యాపిల్‌ సంస్థ తన ఐఫోన్‌ యూజర్ల కోసం చాలాకాలం కిందటే ‘ఫైండ్‌ మై నెట్‌వర్క్‌’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదేతరహాలో ఫైండ్‌ మై ఫోన్‌ ఆప్షన్‌ను గూగుల్ అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్‌ యూజర్లందరూ ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చని తన బ్లాగ్‌లో పేర్కొంది. ఇకపై ఐఫోన్‌లానే ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టేయొచ్చన్నమాట.

రెగ్యులర్‌ Vs డైరెక్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. ఏది బెటర్‌?

ఈ అప్‌గ్రేడ్‌ చేసిన ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ 9 లేదా, ఆ తర్వాత వెర్షన్‌ ఫోన్‌లకు మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. గూగుల్‌కు చెందిన పిక్సెల్‌ 8, 8 ప్రో ఫోన్లలో ఈ సదుపాయం మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఒకవేళ పిక్సెల్‌ ఫోన్‌ ఆఫ్‌లో ఉన్నా, బ్యాటరీ పూర్తిగా అయిపోయినా సరే ఈ ఫోన్లలో ఉండే హార్డ్‌వేర్‌ సాయంతో సులువుగా కనిపెట్టొచ్చని గూగుల్‌ చెబుతోంది. కేవలం స్మార్ట్‌ఫోన్లే కాదు.. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌ బడ్స్‌ను కూడా ఆఫ్‌లైన్‌లో ఉంటే కనిపెట్టేయొచ్చట. వాస్తవానికి ఈ ఫీచర్‌ని గతేడాదే తీసుకురావాలని సంస్థ భావించింది. ఎక్కడ ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తారో అన్న ఉద్దేశంతో కాస్త ఆలస్యంగా అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు గూగుల్‌ ఈ ఏడాది మేలో తీసుకురానున్న పిక్సెల్‌ 8ఏ (Google Pixel 8a) ఫొటోలు బయటకొచ్చాయి. ఈ మొబైల్‌ టెన్సర్‌ జీ3 ప్రాసెసర్‌తో రానున్నట్లు తెలుస్తోంది. వెనకవైపు రెండు కెమెరాలు, 6.1 అంగుళాల డిస్‌ప్లే, 90Hz రీఫ్రెష్‌ రేటు, 5,000mAh బ్యాటరీతో రావొచ్చని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని