Mutual Funds: రెగ్యులర్‌ Vs డైరెక్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. ఏది బెటర్‌?

Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి.  వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు.

Published : 09 Apr 2024 12:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజల్లో ఆర్థిక అవగాహన పెరుగుతోంది. సంప్రదాయ మదుపు సాధనాలకు స్వస్తి పలికి అధిక రాబడినిచ్చే మార్గాల వైపు మొగ్గుచూపుతున్నారు. అందులో చాలా మంది ఎంచుకుంటున్నది మ్యూచువల్‌ ఫండ్లు (Mutual Funds). ముఖ్యంగా ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. దీర్ఘకాల మదుపు వల్ల అధిక రాబడితో పాటు కొంత భద్రత కూడా ఉండడమే దీనికి కారణం. కొంత రిస్క్‌ కూడా ఉన్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేయడంతో పోలిస్తే అది తక్కువే.

మ్యూచువల్‌ ఫండ్లలో (Mutual Funds) మదుపు చేసే వారికి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి డైరెక్ట్‌ ఫండ్‌.. మరొకటి రెగ్యులర్‌ ఫండ్‌. ఈ రెండింటిలోనూ ప్రయోజనాలతో పాటు రిస్క్‌లూ ఉంటాయి. అయితే, వ్యక్తుల లక్ష్యాలను బట్టి వీటిలో ఏది ఎవరికి నప్పుతుందనేది ఆధారపడి ఉంటుంది.

రెగ్యులర్‌ మ్యూచువల్‌ ఫండ్..

రెగ్యులర్ ప్లాన్‌ (Regular Mutual Funds)లలో ఆర్థిక సలహాదారు లేదా బ్యాంక్ రిలేషన్‌షిప్‌ మేనేజర్ వంటి మధ్యవర్తి ద్వారా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లను మధ్యవర్తులు విక్రయిస్తారు. ఫండ్ హౌస్‌లు వారికి కమీషన్లు చెల్లిస్తాయి. దీంతో రెగ్యులర్‌ ప్లాన్లలో వ్యయ నిష్పత్తి అధికంగా ఉంటుంది.

డైరెక్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌..

దీంట్లో (Direct Mutual Funds) ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. నేరుగా ఫండ్‌ హౌస్‌లలోని ప్లాన్లలోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. మధ్యవర్తులు లేనందున ఎలాంటి కమీషన్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది.

వ్యత్యాసాలివే..

నికర ఆస్తుల విలువ (NAV): ఫండ్‌ను నిర్వహించడానికి ఫండ్‌ హౌస్‌లకు వివిధ ఖర్చులు ఉంటాయి. వీటిని నికర ఆస్తుల విలువ ఆధారంగా చెల్లిస్తారు. దీన్నే వ్యయ నిష్పత్తి (Expense Ratio) అంటారు. కమీషన్‌ వల్ల రెగ్యులర్‌ ఫండ్లలో వ్యయ నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఫలితంగా డైరెక్ట్‌ ప్లాన్లతో పోలిస్తే రెగ్యులర్‌ వాటిలో ఎన్‌ఏవీ తక్కువగా ఉంటుంది.

రాబడి: రెగ్యులర్‌ ప్లాన్లలో కమీషన్‌ చెల్లించాల్సిన కారణంగా రాబడి తగ్గిపోతుంది. అదే డైరెక్ట్‌ ప్లాన్లలో ఎలాంటి కమీషన్‌ ఉండదు. దీంతో రెగ్యులర్‌తో పోలిస్తే డైరెక్ట్‌ ప్లాన్లలో రాబడి కాస్త అధికంగా ఉంటుంది.

ఆర్థిక సలహాదారుల పాత్ర: రెగ్యులర్‌ ప్లాన్లలో ఆర్థిక సలహాదారులు నిరంతరం మదుపర్లను గైడ్‌ చేస్తుంటారు. ఏ ఫండ్‌లో ఎంత మొత్తం? ఎప్పుడు పెట్టుబడి పెట్టాలో సూచిస్తారు. తద్వారా రాబడిని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే డైరెక్ట్‌ ప్లాన్లలో పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగానే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

రెగ్యులర్‌ వల్ల ప్రయోజనాలు..

ఆర్థిక సలహాదారు సహాయం: రెగ్యులర్‌ ప్లాన్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు, రిస్క్, రాబడిని అంచనా వేసి లక్ష్యాలకు అనుగుణంగా సరైన ఫండ్లు ఏవో ఆర్థిక సలహాదారులు సూచిస్తారు. కొత్త పెట్టుబడిదారులైతే మద్దతు, సలహా కోసం రెగ్యులర్‌ ఫండ్లను ఎంచుకుంటే మేలు.

నిరంతర పర్యవేక్షణ: డైరెక్ట్ ఫండ్లలో, స్వయంగా మనమే ఫండ్ పనితీరును సమీక్షించుకోవాలి. కానీ, రెగ్యులర్‌ ఫండ్లలో మాత్రం ఆర్థిక సలహాదారు మన తరఫున పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షిస్తారు. అవసరమైతే మార్పులను సూచిస్తారు.

లక్ష్యం ఆధారిత ప్రణాళిక: రెగ్యులర్ ప్లాన్‌లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ ఆర్థిక లక్ష్యానికి సరిపోయే సరైన పెట్టుబడి ప్రణాళికను సిద్ధం చేయడంలో సలహాదారులు సహకరిస్తారు. మార్కెట్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఏది మేలు..

ఒకేరకమైన పథకానికి ఫండ్‌ హౌస్‌లు రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్‌లను అందిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనేది పూర్తిగా మదుపర్లపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక సలహాదారుల నుంచి నిరంతర మద్దతు కావాల్సిన వారికి రెగ్యులర్ ఫండ్‌లు అనుకూలంగా ఉంటాయి. దీంతో లక్ష్యం ఆధారిత పెట్టుబడి ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ వంటి ప్రయోజనాలు ఉంటాయి. కానీ, వీటన్నింటికీ కమీషన్‌ రూపంలో ఖర్చు తప్పదు. దీర్ఘకాలంలో డైరెక్ట్‌ ప్లాన్లతో పోలిస్తే రాబడి తగ్గుతుంది. తక్కువ ఖర్చు, అధిక రాబడి కావాలనుకునేవారు డైరెక్ట్‌ ప్లాన్లను ఎంచుకోవచ్చు. అయితే, సొంతంగా మార్కెట్‌ను అంచనా వేయగలిగి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలి.

రెగ్యులర్‌, డైరెక్ట్‌.. గుర్తించడం ఎలా?

చాలా మంది మదుపర్లు డైరెక్ట్‌, రెగ్యులర్‌ ఫండ్ల మధ్య ఎంపికలో గందరగోళానికి గురవుతారు. దీంతో తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని అంశాల ఆధారంగా డైరెక్ట్‌, రెగ్యులర్‌ ఫండ్‌ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించొచ్చు.

ఫండ్‌ పేరు: మ్యూచువ్‌ ఫండ్‌ పేరులోనే రెగ్యులర్‌ లేదా ‘Reg’ అని ప్రత్యేకంగా పేర్కొంటారు. అలాగే డైరెక్ట్‌ లేదా ‘Dir’ అని ఉంటుంది.

వ్యయ నిష్పత్తి: వ్యయ నిష్పత్తి అధికంగా ఉన్న వాటిని రెగ్యులర్‌ ప్లాన్లుగా గుర్తించొచ్చు.

నికర ఆస్తుల విలువ: ఫండ్‌ ఎన్‌ఏవీనీ పరిశీలించొచ్చు. రెగ్యులర్‌ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్‌ ప్లాన్ల ఎన్‌ఏవీ అధికంగా ఉంటుంది.

కన్సాలిడేటెడ్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ (CAS): సీఏఎస్‌లోని అడ్వైజర్‌ ఫీల్డ్‌లో ‘ఏఆర్‌ఎన్‌’ అని ఉంటే అది రెగ్యులర్‌ ఫండ్‌ అని అర్థం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని