Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!

Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌ మరో కొత్త ఫీచర్‌ని జోడించింది. ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది.

Published : 19 Apr 2024 00:17 IST

Google Maps | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పర్యావరణ హితం కావడంతో చాలా మంది విద్యుత్‌ కార్ల వైపు మక్కువ చూపుతున్నారు. అయితే ఈ తరహా వాహనాలు కొనుగోలు చేసిన వారిలో చాలా మందికి ఎదురవుతున్న సమస్య.. ఛార్జింగ్‌ స్టేషన్స్‌. ఎలక్ట్రిక్‌ వాహనంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన సందర్భాల్లో దగ్గర్లోని ఛార్జింగ్‌ స్టేషన్లు వెతకడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps) సిద్ధమైంది. 

యూజర్ల అవసరాలకు ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెస్తున్న గూగుల్‌ మ్యాప్స్‌.. ఇప్పుడు విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు వెతకడంలోనూ సాయపడనుంది. గూగుల్‌ మ్యాప్స్‌లోని ఏఐ సాయంతో ఇకపై ఛార్జింగ్‌ స్టేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తుంది. ఒకవేళ కారులో వెళుతున్నప్పుడు ఛార్జింగ్‌ తక్కువగా ఉంటే.. దగ్గర్లో ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా గూగుల్‌ మ్యాప్స్ దానంతట అదే చూపిస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఛార్జింగ్ చేయాలో కూడా సూచనలు చేస్తుంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. తొలుత గూగుల్‌ బిల్ట్‌-ఇన్‌ ఉన్న వాహనాలకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని