google pay: గూగుల్‌ పేలో ఇకపై మొబైల్‌ రీఛార్జులపై ఫీజు!

Google pay Recharge:  గూగుల్‌పేలో ఇక మొబైల్‌ రీఛార్జులపై స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీఛార్జి మొత్తం బట్టి కన్వీనియన్స్‌ ఫీజు ఆధారపడి ఉంటుంది.

Published : 23 Nov 2023 16:21 IST

Google pay | ఇంటర్నెట్ డెస్క్‌: గూగుల్‌కు చెందిన పేమెంట్‌ యాప్ గూగుల్‌పే (Google pay) ఇకపై మొబైల్‌ రీఛార్జులపై ఫీజు వసూలు చేయనుంది. కార్డు పేమెంట్, యూపీఐ పేమెంట్‌.. ఇలా ఏ పేమెంట్‌ మోడ్‌ అయినా కన్వీనియన్స్‌ ఫీజు రూపంలో స్వల్ప మొత్తంలో ఫీజు వసూలు చేయబోతోంది. పేటీఎం, ఫోన్‌పే సంస్థలు ఇప్పటికే ఈ తరహా ఫీజును వసూలు చేస్తుండగా.. ఇన్నాళ్లూ ఉచితంగా సర్వీసులు అందించిన గూగుల్ పే సైతం ఫీజును మొదలు పెట్టింది.

గూగుల్‌పేలో ఇటీవల రీఛార్జి చేసిన ఓ యూజర్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. గూగుల్‌ పే ద్వారా జియో ప్రీపెయిడ్‌ రూ.749 ప్లాన్‌ను రీఛార్జి చేయడానికి ప్రయత్నించగా.. రూ.3 కన్వీనియన్స్‌ ఫీజు రూపంలో గూగుల్‌ పే వసూలు చేసినట్లు తన పోస్టులో పేర్కొన్నాడు. జీఎస్టీతో కలిపి మొత్తం రూ.752 చూపించిందని సంబంధిత స్క్రీన్‌ షాట్ షేర్‌ చేశాడు. కొందరు యూజర్లకు ఎలాంటి ఫీజూ వసూలు చేయడం లేదు. ప్రస్తుతానికి కొందరు యూజర్ల నుంచి మాత్రమే ఈ తరహా వసూలు చేస్తుండగా.. భవిష్యత్‌లో అందరి నుంచీ ఈ ఫీజు వసూలు చేసే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై గూగుల్‌ పే ఎక్కడా అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.

ప్యూర్‌ ఈవీ కొత్త బైక్‌ ఎకోడ్రిఫ్ట్‌ 350.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 171km

అయితే, రూ.100లోపు రీఛార్జిపై గూగుల్‌పే ఎలాంటి ఫీజూ వసూలు చేయబోదని ముకుల్‌ శర్మ అనే టిప్‌స్టర్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. రూ.100 నుంచి రూ.200 వరకు రీఛార్జిపై ఒక రూపాయి; రూ.200 నుంచి రూ.300 రీఛార్జిపై రూ.2; రూ.300+ ఎంతైనా రూ.3 చొప్పున కన్వీనియన్స్‌ ఫీజు రూపంలో గూగుల్ పే వసూలు చేయబోతోందంటూ పేర్కొన్నాడు. కొత్తగా కన్వీనియన్స్‌ ఫీజు వసూలు చేయున్నట్లు గూగుల్‌ తన టర్మ్స్‌ అండ్ కండీషన్లలో ఇటీవలే పేర్కొంది. కొన్ని లావాదేవీలకు ఈ తరహా ఫీజు వసూలు చేయనున్నట్లు అందులో తెలిపింది.  కేవలం మొబైల్‌ రీఛార్జులపై మాత్రమే ఈ ఫీజు వసూలు చేస్తుందా? ఇతర బిల్‌ పేమెంట్లకూ వర్తింపజేస్తుందా? అనేది తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని