Google Pay: గూగుల్‌పే సౌండ్‌ బాక్స్‌ వచ్చేస్తోంది..

Google Pay: ఫిన్‌టెక్‌ సంస్థలు ఫోన్‌పే, పేటీఎంకు పోటీగా గూగుల్‌పే సౌండ్‌ పాడ్‌లను తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్‌లో పేర్కొంది.

Published : 23 Feb 2024 22:52 IST

Google Pay | ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్‌కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్‌ పే (Google Pay) త్వరలో సౌండ్‌పాడ్‌లను తీసుకురానుంది. ఇకపై క్యూఆర్‌కోడ్ స్కాన్‌తో యూపీఐ ద్వారా చేసే చెల్లింపులు ఈ స్మార్ట్‌ స్పీకర్‌ ద్వారా వినిపించనున్నాయి. ఈ వైర్‌లెస్‌ స్పీకర్లను ఈ ఏడాదిలోనే తీసుకురానున్నట్లు కంపెనీ గురువారం తన బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది. దీంతో దుకాణాల్లో ఫోన్‌పే (Phone), పేటీఎం (Paytm) సౌండ్‌ బాక్స్‌లే కాకుండా ఇకపై గూగుల్‌పే స్మార్ట్‌ స్పీకర్లు కనిపించనున్నాయన్నమాట.

ట్రయల్‌ రన్‌లో భాగంగా గతేడాదిలోనే గూగుల్‌పే సౌండ్‌పాడ్‌లను పరీక్షించింది. వ్యాపారుల నుంచి సానుకూలమైన అభిప్రాయం రావడంతో ఈ సేవల్ని దేశమంతటా విస్తరించాలని నిర్ణయించుకుంది. రానున్న నెలల్లో వ్యాపారులకు ఇవి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ సౌండ్‌పాడ్‌ ఒక ఎల్‌సీడీ స్క్రీన్‌, సింగిల్‌ స్పీకర్‌తో వస్తుంది. 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుంది. బ్యాటరీ, ఛార్జింగ్‌, కనెక్టివిటీ స్టేటస్‌ను తెలిపే మూడు ఎల్‌ఈడీ ఇండికేటర్లు.. మెనూ, వాల్యూమ్‌, పవర్‌ బటన్‌లు ఉంటాయి.

పేటీఎం యూపీఐ ఐడీ సంగతి చూడండి.. NPCIని కోరిన ఆర్‌బీఐ

ఫోన్‌పే, పేటీఎంలకు పోటీగా గూగుల్‌పే ఈ సౌండ్‌పాడ్‌లను తీసుకురానుంది. పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో గూగుల్‌పే ఈ విభాగంలో అడుగుపెడుతుండడం  గమనార్హం. పేటీఎం సౌండ్‌బాక్స్ బ్యాటరీ 4 నుంచి 12 రోజుల వరకు వస్తాయి. 2జీ లేదా 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేస్తాయి. ఈ స్పీకర్లు రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎల్‌సీడీ స్క్రీన్‌లతో ఒకటి, బ్లూటూత్ కనెక్షన్‌తో మరొకటి. ఫోన్‌పే స్మార్ట్‌స్పీకర్ బ్యాటరీ నాలుగు రోజులు పనిచేస్తుంది. అనేక భాషలకూ సపోర్ట్‌ చేస్తుంది. ఈ మధ్యే మహేశ్‌బాబు వాయిస్‌ను కూడా జోడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని