Google Photos: గూగుల్‌ ఫొటోస్‌లో గజిబిజి లేకుండా.. రెండు కొత్త ఏఐ ఫీచర్లు

Google Photos: గూగుల్‌ ఫొటోస్‌ గ్యాలరీని మరింత సమర్థంగా సర్దేలా కంపెనీ రెండు కొత్త ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టింది. అవేంటో చూద్దాం!

Published : 17 Nov 2023 12:31 IST

Google Photos | ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధతో టెక్నాలజీ రూపురేఖలే మారిపోతున్నాయి. రోజువారీ జీవితంలో ఉపయోగించే అనేక యాప్‌లలోనూ కంపెనీలు ఏఐ టూల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు దాదాపు అందరూ ఉపయోగిస్తున్న గూగుల్‌ ఫొటోస్‌ (Google Photos) సైతం మరిన్ని అధునాతన ఏఐ పీచర్లను తీసుకొచ్చింది. అనేక తీపి గుర్తులు, జ్ఞాపకాలకు వేదికగా మారిన తమ యాప్‌ను వీటితో మరింత ఆకర్షణీయంగా మార్చినట్లు కంపెనీ తెలిపింది. మరి ఆ కొత్త ఫీచర్లేంటో చూద్దాం..

ఒకే సందర్భం, లేదా ఒకే తరహా స్క్రీన్‌షాట్లతో మన గూగుల్‌ ఫొటోస్‌ (Google Photos) గ్యాలరీ నిండిపోతుంటుంది. దీనివల్ల మెమొరీ వృథా కావడంతో పాటు తీపి గుర్తులు, జ్ఞాపకాలను నెమరువేసుకోవడంలో ఇవి కొంత అడ్డుగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో ఒకే తరహా ఫొటోల్లో నుంచి మంచిదాన్ని ఎంచుకొని మిగిలిన వాటిని తొలగించేలా గూగుల్‌ ఫొటోస్‌ (Google Photos) తాజాగా ఓ కొత్త ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని పేరు ఫొటో స్టాక్స్‌. ఈ టూల్‌ మన ఫొటోలలో ఒకే రకంగా ఉన్నవాటిని గుర్తించి ఒక దగ్గరకు చేర్చుతుంది. పైగా వాటిలో ఉన్న బెస్ట్‌ పిక్‌ను అదే సెలెక్ట్‌ చేసి చూపిస్తుంది. కావాలంటే మనమే మనకు నచ్చిన ఫొటోను బెస్ట్‌ పిక్‌గా ఎంచుకోవచ్చు. మిగిలిన వాటిని తొలగించుకోవచ్చు. లేదా అన్నీ ఒకే దగ్గర ఉండాలంటే అలాగే ఉంచుకోవచ్చు. ఒకవేళ అన్నీ గ్యాలరీలో కనిపించాలని మీరు భావిస్తే స్టాక్స్‌ ఫీచర్‌ను ఆఫ్‌ చేసే వెసులుబాటు కూడా ఉంటుంది.

స్క్రీన్‌షాట్లు కొన్ని సందర్భాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, ఫొటోలను చూసుకునే సమయంలో ఇవి అడ్డనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో స్క్రీన్‌షాట్లు, డాక్యుమెంట్లను గూగుల్‌ ఫొటోస్‌ (Google Photos) గ్యాలరీలో ప్రత్యేక ఆల్బమ్‌లా కనిపించే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. అవసరమైనప్పుడు ఫొటోలన్నింటినీ స్క్రోల్‌ చేయకుండానే వీటిని సులభంగా కనిపెట్టొచ్చు. పైగా ఏదైనా స్క్రీన్‌షాట్‌, డాక్యుమెంట్‌కు రిమైండర్‌ కూడా సెట్‌ చేసుకోవచ్చు. తద్వారా మీకు అవసరం ఉన్న రోజు దాన్ని వెంటనే యాక్సెస్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు స్క్రీన్‌షాట్లు, డాక్యుమెంట్లను 30 రోజుల తర్వాత అర్కైవ్‌ కూడా చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్లు ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌ యూజర్లకూ అందుబాటులోకి రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని