Google Photos: గూగుల్‌ ఫొటోస్‌ గుడ్‌న్యూస్‌.. పిక్సెల్‌ ఫోన్లలోని ఈ టూల్స్‌ ఇకపై అందరికీ!

Google Photos: తమ యూజర్లందరికీ ఏఐ టూల్స్‌ను అందించనున్నట్లు గూగుల్‌ ఫొటోస్‌ ప్రకటించింది. ఇప్పటి వరకు పిక్సెల్‌ 8, 8ప్రో స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి.

Updated : 11 Apr 2024 12:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫొటో ఎడిటింగ్ యాప్‌లన్నీ కృత్రిమ మేధ (Artificial Intellingence) ఆధారిత టూల్స్‌ను అందిస్తున్నాయి. యూజర్లకు మరింత మెరుగైన ఎడిటింగ్‌ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్‌ ఫొటోస్‌ (Google Photos) సైతం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాజిక్‌ ఎడిటర్‌, మ్యాజిక్‌ ఎరేజర్‌ సహా ఇతర ఏఐ టూల్స్‌ను తమ యూజర్లందరికీ అందించనున్నట్లు వెల్లడించింది. మే 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.

మ్యాజిక్‌ ఎడిటర్‌, మ్యాజిక్‌ ఎరేజర్‌ను గూగుల్‌ 2023 మేలో తీసుకొచ్చింది. ఇప్పటి వరకు పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇకపై వీటిని అన్ని ఫోన్లలోనూ అందిస్తామని తెలిపింది. గూగుల్‌ ఫొటోస్‌ వాడుతున్న ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు నెలకు 10 సేవ్‌లను ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఆ పరిమితికి మించి వాడాలంటే ప్రీమియం గూగుల్‌ వన్‌ ప్లాన్‌ తీసుకోవాలని వెల్లడించింది.

ఆండ్రాయిడ్‌ 8.0, ఐఓఎస్‌ 15 సహా ఆపై వచ్చిన ఓఎస్‌ల ఆధారిత ఫోన్లలో మాత్రమే మ్యాజిక్‌ ఎరేజర్‌, మ్యాజిక్‌ ఎడిటర్‌ టూల్స్‌ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే మొబైల్‌ ర్యామ్‌ 3జీబీ కంటే ఎక్కువ ఉండాలి. పిక్సెల్‌ ట్యాబ్లెట్లలోనూ ఇవి లభించనున్నాయి. ఫొటోల్లో అవసరం లేని భాగాలను కత్తిరించడం వంటి వాటికి ఎరేజర్‌ టూల్‌ ఉపయోగపడుతుంది. అలాగే ఎడిటర్‌తో ఫొటోను బ్లర్‌ చేయడం, బ్రైట్‌నెస్‌, హెచ్‌డీఆర్‌ ఎఫెక్ట్స్‌, కలర్‌ పాప్‌ వంటి వాటిని మార్పు చేయొచ్చు. సినిమాటిక్‌ ఫొటోస్‌, స్కై సజెషన్స్‌, వీడియో ఎఫెక్ట్స్‌ వంటి ఏఐ ఫీచర్లూ ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని