Smartphones: ఐఫోన్‌14, పిక్సెల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌.. లేటెస్ట్‌ ధరలివే..!

వేసవి ప్రత్యేక సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గాయి. ఐఫోన్‌ 14, పిక్సెల్‌ 7 సిరీస్‌ ఫోన్ల ధరలు దిగొచ్చాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సహా ఆయా వేదికలపై ఉండే ప్రత్యేక ఆఫర్లలో భాగంగా ధరలు తగ్గాయి.

Published : 03 May 2023 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని రోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్ సేల్‌ (Flipkart Big Saving Days Sale) ప్రారంభం కానుంది. ఈ తరుణంలో గూగుల్‌ తమ పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో ధరల్ని తగ్గించింది. సేల్‌ ప్రారంభమైన తర్వాత పిక్సెల్‌ 7 సిరీస్‌ (Pixel 7 series) ఫోన్లపై మరిన్ని డిస్కౌంట్లు జత కానున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో ఈ ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిలో గూగుల్‌కు మాత్రమే ప్రత్యేకమైన టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌ ఉంటుంది. 30వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ని సపోర్ట్‌ చేస్తాయి. వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంది.

ధరల్ని తగ్గించిన తర్వాత గూగుల్‌ పిక్సెల్‌ 7 ధర ప్రస్తుతం రూ.49,999గా ఉంది. అదే పిక్సెల్‌ 7 ప్రో ధరను రూ.69,999గా నిర్ణయించారు. గత ఏడాది ఈ ఫోన్లు వరుసగా రూ.59,999, రూ.84,999 ధర వద్ద మార్కెట్‌లోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ సేల్‌ (Flipkart Big Saving Days Sale)లో ఇవ్వనున్న ఆఫర్లను బట్టి చూస్తే వీటి ధరలు మరో రూ.5,000 వరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ తగ్గింపు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌, బ్యాంక్‌ కార్డులతో కొనుగోళ్ల రూపంలో ఉండే అవకాశం ఉంది.

తగ్గిన ఐఫోన్‌ 14 ధర.. 

యాపిల్‌ మరికొన్ని రోజుల్లో ఐఫోన్‌15ను ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ 14 ధరలు (iPhone 14 Price) కొంత వరకు దిగొచ్చాయి. ముఖ్యంగా థర్డ్‌ పార్టీ వేదికలపై కొనుగోలు చేసేవారికి ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌ వంటి వాటిలో ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. అధికారికంగా ఐఫోన్‌14 (iPhone 14 Price) బేస్‌ మోడల్‌ ధర రూ.79,900. కానీ, క్రెడిట్‌ కార్డులు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు ఆయా సైట్లలో ఉన్న ప్రత్యేక తగ్గింపులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ధర రూ.66 వేల వరకు దిగొచ్చినట్లు స్పష్టమవుతోంది. ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్‌లో పైన తెలిపిన మోడల్‌ ప్రారంభ ధర రూ.69,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లకు ఫ్లాట్‌ రూ.4,000 తగ్గింపు లభిస్తోంది. ఈ లెక్కన ఐఫోన్‌14 బేస్‌ మోడల్‌ ధర రూ.65,999కి చేరింది. ఇలాగే అమెజాన్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌ సహా ఇతర వేదికల్లోనూ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

మే 11న పిక్సెల్‌ 7ఏ..

మరోవైపు గూగుల్‌ తమ కొత్త పిక్సెల్‌ 7ఏ (Pixel 7a) ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. మే 11న దేశీయ విపణిలోకి దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇటీవల ఈ ఫోన్‌ ధర, రంగులు సహా పలు స్పెసిఫికేషన్లపై ఆన్‌లైన్‌లో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో మే 11 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని