Google Gemini: ‘ఎన్నికలపై నాకేం తెలియదు’.. గూగుల్‌ జెమిని సమాధానం!

Google Gemini: గూగుల్‌ జెమిని సమాధానాలు ఇటీవల చర్చనీయాంశమైన నేపథ్యంలో టెక్‌ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికలపై సమాధానం ఇవ్వకుండా మార్పులు చేసింది.

Updated : 13 Mar 2024 11:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్‌ జెమిని (Google Gemini) ఇస్తున్న సమాధానాలు ఇటీవల వివాదాస్పదమయ్యాయి. దీంతో ఈ టెక్ కంపెనీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిపై స్పందించకుండా జెమినిపై పరిమితులు విధించింది. ఆ మేరకు దాని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రశ్నించగా.. ‘‘ఈ అంశంపై ఎలా స్పందించాలో నేర్చుకుంటున్నాను’’ అని జెమిని సమాధానం చెప్పడం గమనార్హం. ‘‘ఆలోపు గూగుల్‌లో వెతకండి’’ అని సూచిస్తోంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ (Google) అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఈ ఏడాది అమెరికా, దక్షిణాఫ్రికా, భారత్‌ సహా పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని మోదీ విషయంలో జెమిని స్పందించిన తీరు తీవ్ర వివాదానికి దారి తీయగా.. గూగుల్‌ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని కంపెనీని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు భారత్‌లో ఏఐ టూల్స్‌ను విడుదల చేయబోయే ముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. అలాగే అవి ఇచ్చే సమాధానాల్లో పొరపాట్లు ఉండే అవకాశం ఉందని లేబుల్‌ కూడా చేయాలని సూచించింది.

ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌.. ఈసీతో గూగుల్‌ జట్టు

గూగుల్‌ నుంచి వచ్చిన పలు ఏఐ సాధనాలు ఇస్తున్న సమాధానాలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. దీంతో జెమినిలోని (Google Gemini) ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్‌ను గత నెల తాత్కాలికంగా కంపెనీ నిలిపివేసింది. వీటిపై సీఈఓ సుందర్‌ పిచాయ్‌ స్పందిస్తూ.. లోపాలను సరిదిద్దుతున్నామని తెలిపారు. తమ చాట్‌బాట్‌ సమాధానాలు పూర్తి వివక్షాపూరితంగా, ఆమోదించలేని విధంగా ఉన్నాయని అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని