Google: గూగుల్‌లో సెర్చ్‌కు కొత్త మార్గం.. ఏఐ టూల్స్‌తో ఆవిష్కరణ

Google: గూగుల్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపడుతోంది. తాజాగా ఏఐ సాంకేతికత జోడించిన రెండు నూతన టూల్స్‌ను తీసుకొచ్చింది. ఇది సెర్చ్‌ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది.

Updated : 19 Jan 2024 12:42 IST

వాషింగ్టన్‌: ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్ (Google) గురువారం రెండు కొత్త కృత్రిమ మేధ టూల్స్‌ను (AI Tools) ప్రకటించింది. ఇవి ఆన్‌లైన్‌లో శోధనను మరింత సులభం చేస్తాయని పేర్కొంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్‌పై కనిపించే వస్తువులను సర్కిల్ లేదా హైలైట్ చేసి దానికి సంబంధించి లోతైన సమాచారాన్ని తెలుసుకునేందుకు కొత్త ఏఐ టూల్స్‌ దోహదం చేస్తాయి.

చాట్‌జీపీటీ (ChatGPT) సహా ఇతర చాట్‌బాట్‌లకు ఉపకరించే జెనరేటివ్‌ ఏఐ సాంకేతికతను మరింత మెరుగుపర్చే టూల్స్‌ను పరీక్షిస్తున్నట్లు గూగుల్‌ (Google) గత ఏడాది తెలిపింది. తాజాగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను బుధవారం విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8 ప్రో సహా ఇతర ప్రీమియం ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనూ త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్‌ తెలిపింది.

తాజాగా తీసుకొచ్చిన రెండు కొత్త ఫీచర్లలో ‘సర్కిల్‌ టు సెర్చ్‌’ ఒకటి. స్క్రీన్‌పై కనిపించే ఫొటో, వీడియో, టెక్ట్స్‌పై సర్కిల్‌, ట్యాప్‌, హైలైట్‌, స్క్రిబిల్‌ చేసినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. లేదా హైలైట్‌ చేసిన దానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు సంధించినా.. సమాచారం మీ ముందుంటుంది.

మరో ఫీచర్‌ ద్వారా ఫోన్‌ కెమెరాలో ఏదైనా వస్తువు లేదా ప్రదేశాన్ని కవర్‌ చేస్తూ దానికి సంబంధించి ఎలాంటి ప్రశ్ననైనా అడగొచ్చు. ఫొటో లేదా స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్‌ చేసి కూడా సమాచారం పొందొచ్చు. ఉదాహరణకు మనకు తెలియని ఒక ఆటను కెమెరాలో బంధించి దాన్ని ఎలా ఆడాలో అడిగితే పూర్తి వివరాలు వచ్చేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని