Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియాకు ఊరట.. కంపెనీలో కేంద్రానికి మెజార్టీ వాటా!

 బకాయిలను వాటాలుగా మార్చేందుకు వొడాఫోన్‌ ఐడియా(Vodafone Idea) కేటాయించిన ఈక్విటీ వాటాకు ఆమోదం తెలుపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వొడాఫోన్‌ ఐడియాలో మెజార్టీ వాటా కేంద్రం సొంతమైంది.

Published : 03 Feb 2023 22:29 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) లిమిటెడ్‌కు బకాయిల విషయంలో భారీ ఊరట లభించింది. కంపెనీ చెల్లించాల్సిన వడ్డీకి బదులుగా ప్రభుత్వానికి కేటాయించిన షేర్లను శుక్రవారం కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ ఈక్వీటీ వాటాలుగా మార్చుకుంది. దీంతో రూ. 10 విలువతో వోడాఫోన్‌ ఐడియాలో 33 శాతం వాటా కేంద్రం సొంతమైంది. ‘‘స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి కంపెనీ చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి కేటాయించిన ఈక్విటీ షేర్లను వాటాగా మార్చుకుంటున్నట్లు కేంద్రం కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో రూ.10 షేర్‌ విలువతో రూ.16,133 కోట్ల విలువైన షేర్లను కంపెనీ కేంద్రానికి  బదిలీ చేసింది’’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

స్పెక్ట్రమ్‌ వాయిదాలు, ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై టెలికాం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం  2021 సెప్టెంబరులో మారటోరియం ప్రకటించింది. అయితే, ఈ బకాయిలపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ వడ్డీ చెల్లించలేని కంపెనీలు తమ కంపెనీలో ఈక్విటీ వాటాను ప్రభుత్వానికి అప్పగించేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో వోడాఫోన్‌ ఐడియా వాటాలను అప్పగించేందుకు మొగ్గు చూపింది. పలు కారణాలతో కేంద్రం ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తోంది. తాజాగా దీనికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వొడాఫోన్‌ ఐడియాలో మెజార్టీ వాటా కేంద్రం సొంతమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని