International spoofed calls: నకిలీ ఇంటర్నేషనల్‌ కాల్స్‌.. టెలికాం సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు!

International spoofed calls: భారత మొబైల్‌ నంబర్లతో వచ్చే ఇంటర్నేషనల్‌ నకిలీ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఆ దిశగా టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

Published : 26 May 2024 19:16 IST

దిల్లీ: భారతీయ మొబైల్ నంబర్లతో వచ్చే అన్ని అంతర్జాతీయ నకిలీ కాల్స్‌ను బ్లాక్ చేయాలని టెలికాం ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. దేశీయ పౌరులకు స్థానిక నంబర్లతో మోసగాళ్లు అంతర్జాతీయ కాల్స్‌ చేస్తూ సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు టెలికాం విభాగం (DoT) తెలిపింది.

కాలింగ్ లైన్ గుర్తింపు (CLI)ని మార్చడం ద్వారా విదేశాల్లోని సైబర్ నేరస్థులు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తద్వారా వర్చువల్‌ కిడ్నాప్‌లు, FedEx స్కామ్‌లు, కొరియర్‌లో మాదకద్రవ్యాల వంటి మోసాలకు తెరతీస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ, పోలీసు అధికారులమంటూ పరిచయం చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. DoT లేదా TRAI అధికారులమని చెప్పి మొబైల్ నంబర్‌లను రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

సైబర్‌ నేరాలకు చక్షు కళ్లెం

డీవోటీ, టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు కలిసి అంతర్జాతీయ నకిలీ కాల్స్‌ను అరికట్టేందుకు ఓ వ్యవస్థను రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. వాటిని అమల్లోకి తీసుకొచ్చేలా ఇప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ల్యాండ్‌లైన్‌ నంబర్లకు వచ్చే అలాంటి కాల్స్‌ను పూర్తిగా అరికట్టగలిగామని తెలిపింది. అయినప్పటికీ.. కొంత మంది ఇతర మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. అలాంటి వాటిని ‘సంచార్‌ సాథీ’ వెబ్‌సైట్‌లోని ‘చక్షు’లో రిపోర్ట్‌ చేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని