Budget: ‘సరసమైన ఇళ్ల’ నిర్వచనంలో మార్పునకు క్రెడాయ్‌ విజ్ఞప్తి

Budget: 2017లో నిర్ణయించిన ‘సరసమైన ఇళ్ల’ నిర్వచనాన్ని మార్చుతూ బడ్జెట్‌లో ప్రకటన ఉండాలని కేంద్రాన్ని క్రెడాయ్‌ కోరింది.

Updated : 09 Jul 2024 15:54 IST

దిల్లీ: రెసిడెన్షియల్ ప్రాపర్టీల డిమాండ్‌ను పెంచడానికి గృహ రుణాలపై చెల్లించే వడ్డీతో పాటు అసలు మొత్తంపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని ‘భారత స్థిరాస్తి సంఘాల సమాఖ్య’ (CREDAI) ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ‘సరసమైన ఇళ్ల’ నిర్వచనాన్ని సైతం సవరించాలని బడ్జెట్‌ (Union Budget 2024) అంచనాల్లో భాగంగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం సెక్షన్‌ 80సీ కింద గృహ రుణాల అసలు మొత్తం చెల్లింపులో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని మరింత విస్తరిస్తూ బడ్జెట్‌లో (Union Budget 2024) ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని క్రెడాయ్‌ కోరింది. లేదా అసలు మొత్తం కింద చేసే చెల్లింపులకు సెక్షన్‌ 80సీకి వెలుపల ప్రత్యేక మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసింది.

రూ.45 లక్షలకు పరిమితమైన ‘సరసమైన ఇళ్ల’ (Affordable Housing) నిర్వచనాన్ని సవరించాలని క్రెడాయ్‌ డిమాండ్‌ చేసింది. ఈ పరిమితిని 2017లో నిర్ణయించారని గుర్తుచేసింది. అప్పటితో పోలిస్తే ద్రవ్యోల్బణం, స్థిరాస్తి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. ‘నేషనల్‌ హౌసింగ్ బ్యాంక్‌’ గణాంకాల ప్రకారం.. 2018 నుంచి స్థిరాస్తి ధరలు 24 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.45 లక్షల బడ్జెట్‌లో ఇళ్లు నిర్మించడం డెవలపర్లకు సాధ్యం కావడం లేదని వివరించింది. సరసమైన ఇళ్ల నిర్వచనానికి ధరలను కాకుండా విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని క్రెడాయ్‌ సూచించింది. మెట్రో ప్రాంతాల్లో 90 చదరపు మీటర్లు.. మెట్రోయేతర ప్రాంతాల్లో 120 చదరపు మీటర్లలో నిర్మించే వాటిని ఈ కేటగిరీలోకి తీసుకురావాలని సిఫార్సు చేసింది.

ఎన్‌పీఎస్‌ మరింత ఆకర్షణీయంగా.. బడ్జెట్‌లో ప్రకటన?

ప్రస్తుతం గృహ రుణాలపై చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. దీన్ని రూ.5 లక్షల వరకు పెంచాలని క్రెడాయ్‌ (CREDAI) కోరింది. దేశ జీడీపీకి గణనీయ వాటా సమకూరుస్తూ స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపింది. మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి కల్పనకూ తోడ్పాటునందిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని వివరించింది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు