NPS: ఎన్‌పీఎస్‌ మరింత ఆకర్షణీయంగా.. బడ్జెట్‌లో ప్రకటన?

NPS: ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. దీంతో ఎన్‌పీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రకటనలు ఉండొచ్చని సమాచారం.

Updated : 27 Jan 2024 12:53 IST

దిల్లీ: ‘జాతీయ పింఛను వ్యవస్థ (NPS)’ను ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్‌పీఎస్‌లో జమ, ఉపసంహరణలపై పన్ను మినహాయింపులను విస్తరించడం సహా పలు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా 75 ఏళ్లు పైబడిన ఎన్‌పీఎస్‌ (NPS) చందాదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించే అవకాశం ఉందని చెప్పారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో (Interim Budget) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేయొచ్చని ఆశిస్తున్నారు.

‘ఉద్యోగుల భవిష్య నిధి (EPFO)’తో సమానంగా ఎన్‌పీఎస్‌లోనూ (NPS) పన్ను ప్రయోజనాలు కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని పింఛను ఫండ్‌ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ కోరింది. దీనిపై బడ్జెట్‌లో స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం యాజమాన్యాలు తమ ఉద్యోగుల ఎన్‌పీఎస్‌కు తమ వాటాగా చెల్లించే మొత్తంలో 10 శాతంపై పన్ను మినహాయింపు వర్తిస్తోంది. ఈపీఎఫ్‌ఓలో ఈ పరిమితి 12 శాతంగా ఉంది.

ఎన్‌పీఎస్‌లో (NPS) దీర్ఘకాల పొదుపును ప్రోత్సహించేలా 75 ఏళ్ల పైబడిన చందాదారులపై పన్ను భారాన్ని తగ్గించాలని డెలాయిట్‌ తమ బడ్జెట్‌ డిమాండ్లలో పేర్కొంది. వారి యాన్యుటీ వాటాపై పన్ను పూర్తిగా తొలగించాలని సూచించింది. అలాగే వీరికి ఎన్‌పీఎస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయించాలని కోరింది.

ప్రస్తుతం పాత ఆదాయ పన్ను విధానం ప్రకారం.. ఎన్‌పీఎస్‌లో జమ చేసే మొత్తంలో రూ.50 వేల వరకూ పన్ను రాయితీ లభిస్తోంది. 80సీ కింద లభించే రూ.1.5 లక్షల రాయితీకి ఇది అదనం. ఈ వెసులుబాటును కొత్త పన్ను విధానానికీ విస్తరించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే ఎన్‌పీఎస్‌లో (NPS) మార్పులపై సిఫార్సుల కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక కార్యదర్శి టి.వి.సోమనాథన్‌ నేతృత్వంలో ఏర్పడిన ఈ బృందం ఇంకా నివేదిక సమర్పించాల్సి ఉంది. ఉద్యోగులకు మరిన్ని పింఛను ప్రయోజనాలు అందించేలా ప్రస్తుత ఎన్‌పీఎస్‌లో ఏమైనా మార్పులు చేయాలా అనే విషయంపై ఈ కమిటీ సూచనలు చేయనుంది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని