Telecom: ప్రపంచంలో చౌకైన టెలికాం సేవలు భారత్‌లోనే ఉండాలి: అశ్వినీ వైష్ణవ్‌

Telecom: ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత చౌకైన టెలికాం సేవలు భారత్‌లోనే ఉన్నాయని.. ఇక ముందూ ఇవి కొనసాగాలని ప్రభుత్వం కోరుకుంటోందని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Updated : 29 Oct 2023 14:08 IST

దిల్లీ: భారత టెలికాం సేవలు (Telecom services) ప్రపంచంలోనే అత్యంత చౌకైనవిగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా అత్యంత అందుబాటు ధరలో ఉన్న టెలికాం రంగం ప్రస్తుతం భారత్‌దేనని వెల్లడించారు.

టెలికాం నిపుణుల ప్రకారం.. ‘ఒక్కో యూజర్‌పై సగటు ఆదాయం (ARPU)’ రూ.270- 300గా ఉండాలి. అలా అయితేనే 5జీ నెట్‌వర్క్‌ అమలుపై చేసిన వ్యయం వచ్చే మూడేళ్లలో తిరిగి వస్తుంది. ప్రస్తుతం ఆర్పూ రూ.140-200గా ఉంది. చైనాలో ఇది రూ.580గా నమోదైంది. ప్రపంచ సగటు ఆర్పూ రూ.600- 850. గత ఏడాది అమల్లోకి వచ్చిన 5జీ సేవల నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఎలాంటి ఆదాయం రావడం లేదని ‘సెల్యూలార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ఇటీవల తెలిపింది. మరోవైపు తమ నెట్‌వర్క్‌కు భారీ ఎత్తున ట్రాఫిక్‌ తీసుకొస్తున్న యాప్‌లు.. వారి ఆదాయంలో కొంత భాగాన్ని తమకు చెల్లించాలని టెలికాం ఆపరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. భారత్‌లో ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ రెండు కంపెనీలు కలిసి 5జీ నెట్‌వర్క్‌పై రూ.3 లక్షల కోట్లు వెచ్చించాయని అంచనా. ఈ రెండు కంపెనీలూ ఇప్పటి వరకు 5జీ సేవల కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ విస్తరణ దీపావళి తర్వాత ఊపందుకుంటుందని వైష్ణవ్‌ తెలిపారు. తర్వాత దీన్ని 5జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తామని పేర్కొన్నారు. 6జీపై తమ రోడ్‌మ్యాప్‌ను వెల్లడిస్తూ.. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ విషయంలో నాయకత్వం వహించాలని భారత టెలికాం సంస్థలకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించారు. మన దేశ 6జీ విజన్‌ను ఇంటర్నేషనల్‌ టెలికాం యూనియన్‌ ఆమోదించినట్లు తెలిపారు. ఈ కొత్త సాంకేతికతపై పనిచేయడం కోసం టెలికాం, విద్య, ప్రభుత్వ, పరిశోధన విభాగాలతో కూడిన కూటమి కూడా ఏర్పాటైనట్లు వెల్లడించారు. యాంటెనా గ్రూప్‌, వేవ్‌ఫారం గ్రూప్‌, ఎక్విప్‌మెంట్‌ గ్రూప్‌లు 6జీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

యూజర్ల రక్షణపై దృష్టి సారిస్తూ టెలికాం రంగంలో రెండో దశ సంస్కరణలు ప్రారంభమయ్యాయని వైష్ణవ్‌ తెలిపారు. ఆ క్రమంలో వచ్చిందే సంచార్‌ సాథి అని వివరించారు. క్రమంగా మరిన్ని మార్పులూ రాబోతున్నట్లు తెలిపారు. 2021లో వచ్చిన తొలి దశ సంస్కరణల్లో భాగంగా టెలికాం కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని