GST collection: మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు..

GST collection: మేలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 10 శాతం వృద్ధి నమోదైంది.

Published : 01 Jun 2024 20:27 IST

GST collection | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో జీఎస్టీ వసూళ్లు (GST collection) భారీగా నమోదయ్యాయి. మే నెలకు గాను రూ.1.73 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 10శాతం అధికం. 

మేలో దిగుమతులు 4.3 శాతం క్షీణించినా దేశీయంగా లావాదేవీలు 15.3 శాతం పెరగడంతో జీఎస్టీ వసూళ్లలో 10శాతం వృద్ధి నమోదైందని ఆర్థికశాఖ పేర్కొంది. రిఫండ్ల తర్వాత 2024 నికర జీఎస్టీ రెవెన్యూ 6.9శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లుగా నమోదైంది. మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.32,409 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.40,265 కోట్లు, ఐజీఎస్టీ రూ.87,781 కోట్లుగా ఉంది. సెస్సుల రూపంలో రూ.12,284 కోట్లు వచ్చింది. 

ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించిన యూనియన్‌ బ్యాంక్‌.. లేటెస్ట్‌ రేట్లు ఇవే..

2024-25 ఆర్థిక సంవత్సరంలో మే నాటికి స్థూల జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11.3శాతం పెరిగి రూ.3.83 లక్షల కోట్లుకు చేరుకున్నాయి. అదే సమయంలో దేశీయ లావాదేవీలు 14.2శాతం పెరగ్గా, దిగుమతుల్లో 1.4శాతం పెరుగుదల కనిపించింది. రిఫండ్ల తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో నికర జీఎస్టీ ఆదాయం 11.6 శాతం పెరిగి రూ.3.36 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రాల వారీగా చూసినప్పుడు.. ఏపీలో గతేడాది మేలో రూ.3,373 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరగ్గా.. ఈసారి ఆ మొత్తం 15 శాతం వృద్ధితో రూ.3,890 కోట్లుగా నమోదైంది. తెలంగాణలో గతేడాది రూ.4,507 కోట్లుగా ఉన్న వసూళ్లు 11 శాతం పెరిగి రూ.4,986 కోట్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని