AI Model: చాట్‌జీపీటీ తరహాలో భారత్‌లో ‘హనుమాన్‌’ ఏఐ మోడల్‌!

AI Model: భారత యూజర్ల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఏఐ మోడల్‌ హనుమాన్‌ను భారత్‌జీపీటీ మంగళవారం ప్రదర్శించింది.

Updated : 21 Feb 2024 13:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) రంగంలో కీలక పాత్ర పోషించాలనే భారత కలలు సాకారమయ్యే దిశగా ముందడుగు పడింది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పలు ఐఐటీల సమన్వయంతో ఏర్పాటైన భారత్‌జీపీటీ (BharatGPT) వచ్చే నెల చాట్‌జీపీటీ తరహా సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన  ‘లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌’ను మంగళవారం ముంబయిలో జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించింది.

దీని పనితీరును తెలియజేసే వీడియోను భారత్‌జీపీటీ (BharatGPT) ప్రేక్షకుల ముందు ఉంచింది. వీరు రూపొందించిన ఏఐ బాట్‌తో ఓ వ్యక్తి తమిళంలో మాట్లాడి సమాధానం రాబట్టారు. ఓ బ్యాంకర్‌ హిందీలో చాట్‌ చేశారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కంప్యూటర్‌ కోడ్‌ను రాసేందుకు ఉపయోగించారు. ఈ మోడల్‌కు ‘హనుమాన్‌’గా (Hanooman) నామకరణం చేసినట్లు సమాచారం. మొత్తం 11 స్థానిక భాషల్లో ఇది పనిచేస్తుందని తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ, గవర్నెన్స్‌, ఆర్థిక సేవలు, విద్యా రంగాల్లో ఇది సేవలు అందించనుంది. ఐఐటీలతో పాటు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, భారత ప్రభుత్వ సహకారంతో దీన్ని రూపొందించారు.

హనుమాన్‌ ‘స్పీచ్‌-టు-టెక్ట్స్‌’ వంటి సేవలను అందిస్తుందని ఐఐటీ బాంబే కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి గణేశ్‌ రామకృష్ణన్‌ వెల్లడించారు. దీన్ని ఆధారం చేసుకొని ప్రత్యేక అవసరాలకు కావాల్సిన మోడళ్లను రిలయన్స్‌ జియో అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఇప్పటికే తమ సబ్‌స్క్రైబర్లకు ఏఐ సేవలను అందించేందుకు ‘జియో బ్రెయిన్‌’ పేరిట రిలయన్స్‌ ఓ మోడల్‌ను తయారు చేస్తోంది. మరోవైపు భారత యూజర్ల అవసరాలకు అనుగుణంగా సర్వం, కృత్రిమ్‌ వంటి అంకుర సంస్థలు సైతం ఏఐ మోడళ్లను (AI Models) అభివృద్ధి చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని