Adani: అకౌంటింగ్‌ మోసాల ఆరోపణలు.. అదానీ షేర్లకు భారీ నష్టాలు!

అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలు గుప్పించింది.

Updated : 26 Jan 2023 09:16 IST

అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్‌ పరిశోధన నేపథ్యం
అవన్నీ ద్వేషపూరితం.. నిరాధారం: అదానీ గ్రూప్‌

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg research) ఆరోపణలు గుప్పించింది. రెండేళ్ల పరిశోధనను సంస్థ ఉటంకించింది. అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) ఈనెల 27 నుంచి 31న జరగనున్న నేపథ్యంలో వచ్చిన ఆరోపణలతో, బుధవారం అదానీ గ్రూప్‌ (Adani Group) షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే ‘ఇవన్నీ ద్వేషంతో, ఆధారాల్లేకుండా, ఏకపక్షంగా చేసిన ఆరోపణలు. మా గ్రూప్‌ కంపెనీల షేర్ల విక్రయాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో చేసినవ’ని అదానీ గ్రూప్‌ (Adani Group) పేర్కొంది. తమను ఏమాత్రం సంప్రదించకుండా, నిజనిజాలు తెలుసుకోకుండా నివేదికను వెల్లడించడంపై దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలిపింది. ‘ఈ ఆరోపణలు, భారత్‌లోని అత్యున్నత న్యాయ స్థానాల్లో ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి కూడా’ అని వివరించింది. ‘అదానీ గ్రూప్‌ (Adani Group)పై పెట్టుబడుదార్ల వర్గాలకు ఎపుడూ విశ్వాసం ఉంది.  దేశ, అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు, ఆర్థిక నిపుణులు రూపొందించిన నివేదికలను విశ్లేషించుకున్నాకే వారు ధీమాగా ఉన్నార’ని పేర్కొంది.

ఆ నివేదికలోని కొన్ని ఆరోపణలు

* అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) వ్యక్తిగత నికర సంపద 120 బి.డాలర్లకు చేరింది. ఇందులో గత మూడేళ్లలోనే 100 బి.డాలర్లు సమకూరింది. గ్రూప్‌లోని 7 నమోదిత కంపెనీల షేర్లు మూడేళ్లలో సగటున 819% లాభపడ్డాయి.
* పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరేబియన్‌, మారిషస్‌ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోంది. వీటి ద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోంది. గ్రూప్‌ నమోదిత కంపెనీల నుంచి నగదు బదిలీ చేస్తోంది.
* అదానీ గ్రూప్‌లోని మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు డజన్ల కొద్దీ వ్యక్తులతో మాట్లాడి, వేలకొద్దీ పత్రాలను, దాదాపు 6 దేశాల్లో కంపెనీ కార్యాలయాలను పరిశీలించాకే ఈ పరిశోధనా నివేదికను వెల్లడిస్తున్నామని సంస్థ తెలిపింది.
* ‘మా నివేదికలోని అంశాలను పట్టించుకోకపోయినా.. అదానీ గ్రూప్‌ ఆర్థిక ఫలితాలను, ముఖ విలువ పరంగా పరిశీలించండి. 7 కీలక నమోదిత కంపెనీలను కేవలం మూలాల ప్రకారం చూస్తే, 85 శాతం దిగువన ఉన్నాయి. వాటి షేర్ల విలువలు ఆకాశంలో తచ్చాడుతున్నాయి. ఈ కంపెనీలపై భారీ అప్పులు చేశారు. పెరిగిన షేరు విలువలను చూపించి, తనఖా ద్వారా భారీమొత్తంలో రుణాలు దక్కించుకున్నార’ని పేర్కొంది.

గతంలో క్రెడిట్‌ సైట్స్‌ కూడా..: ఫిచ్‌ గ్రూప్‌నకు చెందిన క్రెడిట్‌సైట్స్‌ కూడా గతేడాది సెప్టెంబరులో ‘అదానీ గ్రూప్‌పై భారీ రుణభారం ఆందోళనకరమ’నే నివేదిక ఇచ్చింది. తర్వాత గణించడంలో పొరబాట్లు జరిగాయని ఆ సంస్థ పేర్కొంది. అయితే రుణాలపై ఆందోళనలున్నట్లు మాత్రం స్పష్టం చేసింది. కంపెనీల రుణ నిష్పత్తులు ఆరోగ్యకరంగా ఉన్నాయని.. సంబంధిత రంగ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని అప్పట్లో అదానీ గ్రూప్‌ పేర్కొంది.

8.37% వరకు పతనం : అదానీ ట్రాన్స్‌మిషన్‌ అత్యధికంగా 8.37% కోల్పోయి రూ.2,511.75 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ 6.30%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5.59%, అదానీ విల్మర్‌ 5%, అదానీ పవర్‌ 5%, అదానీ గ్రీన్‌ 3.04%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.54%, అంబుజా, ఏసీసీ 7%, ఎన్‌డీటీవీ 5% నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని