Smartphone trick: గుంపులో స్మార్ట్‌ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్‌తో పట్టేశాడు..!

తన స్మార్ట్‌ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్‌తో పట్టేశాడు ఓ టెక్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌. జరిగిందంతా ఓ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

Updated : 23 Apr 2024 18:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి. కేవలం ఫోన్‌ నంబర్లే కాదు.. మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారమూ అందులోనే ఉంటోంది. మన అశ్రద్ధ వల్ల స్మార్ట్‌ఫోన్‌ పోతే.. దానికి ఎవర్నీ నిందించక్కర్లేదు. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మన స్మార్ట్‌ఫోన్లు కొట్టేస్తే.. బాధపడాల్సి వస్తుంది. పైగా వందల మంది గుమిగూడినచోట అలాంటిదేమైనా జరిగితే ఇక వాటిపై ఆశలు వదులుకోవాల్సిందే. అంతమంది గుమిగూడిన చోట కూడా కొట్టేసిన ఫోన్లను సింపుల్‌ ట్రిక్‌తో కనిపెట్టి  రెండు ఫోన్లను పొందగలిగాడు ఓ టెక్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌. ఇంతకీ ఏం జరిగింది? అంతమందిలో ఉన్నా తన ఫోన్లను ఎలా కనిపెట్టగలిగాడు?

టెక్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లలో ఒకరైన షారుక్‌.. గతేడాది రంజాన్‌ సందర్భంగా జరిగిన ఘటనను తాజాగా పంచుకున్నాడు. తన భార్యతో దిల్లీలోని జామా మసీదుకు ఇఫ్తార్‌ విందుకు వెళ్లినప్పుడు జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. రెండు ఫోన్లు ఎలా పోగొట్టుకున్నదీ.. వాటిని ఎలా తిరిగి పొందిందీ తెలిపాడు. వరుస ట్వీట్లలో దాన్ని వివరించాడు.

వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!

‘‘2023 ఏప్రిల్‌ 15న దిల్లీలోని రంజాన్‌ నెల సందర్భంగా జామా మసీదుకు నేనూ, నా భార్య ఇఫ్తార్‌ విందుకు వెళ్లాం. చుట్టూ ఇసుకేస్తే రాలనంత జనం. మా దగ్గర మూడు ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్‌ 13, షావోమి సివి2, రెడ్‌మీ కే50 అల్ట్రా. మూడు ఫోన్లనూ బ్యాగ్‌లో ఓ జిప్‌లో పెట్టాం. కాసేపటి తర్వాత చూస్తే బ్యాగు తెరిచి ఉంది. అందులో ఐఫోన్‌, షావోమి ఫోన్లు మాయమయ్యాయి. చూసిన వెంటనే ‘దొంగా.. దొంగా. నా ఫోన్లు ఎవరో కొట్టేశారు’ అంటూ గట్టిగా అరిచా. అయినా ఫలితం లేకపోయింది. అక్కడే ఉన్న అధికారులకు వెంటనే సమాచారం చేరవేశా. నాకు సాయం చేయకపోగా.. ‘మీలాంటి వాళ్ల కోసమే మైక్‌లో చెప్తుంటాం. మమ్మల్ని పట్టించుకుంటేగా’ అంటూ మాపైనే తిరిగి అరిచారు. 

ఏం చేశానంటే?

  • తొలుత ఐఫోన్‌కు కాల్‌ చేశా. స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. తర్వాత ఇంకో ఫోన్‌కు కాల్ చేశా. ఆ ఫోన్‌ ఆన్‌లోనే ఉంది. ఆ ఫోన్‌ను ఆపలేకపోయారు. షట్‌డౌన్‌ కన్ఫర్మేషన్‌ ఫీచర్‌ని ఎనేబుల్‌ చేసుకోవడమే దానికి కారణం. ఈ ఫీచర్‌ ఆన్‌లో ఉన్నప్పుడు స్విచ్చాఫ్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ ఇవ్వాల్సిందే. దీంతో ఆ ఫోన్‌ను అలానే ఉంచేశారు.
  • వెంటనే నా దగ్గర ఉన్న వేరే మొబైల్‌లో ‘ఫైండ్‌ మై డివైజ్‌ ’ ఫీచర్‌ ఓపెన్‌ చేశాను. అందులో చూస్తే... మొబైల్‌  లొకేషన్‌ అదే మసీదు ప్రాంగణంలో చూపించింది. ఫైండ్‌ మై డివైజ్‌లో మిస్‌ అయిన మొబైల్‌ సెలక్ట్‌ చేసుకొని.. ట్యాప్‌ సౌండ్‌ క్లిక్‌ చేశా. దీంతో ఆ ఫోన్‌ మోగడం మొదలైంది. ఆ సౌండ్‌ను సైలెంట్ చేయాలన్నా అవతలి వారికి కుదరదు.
  • ఆ ఫోన్‌ నుంచి  శబ్దం గట్టిగా వస్తూనే ఉండటంతో... వెంటనే ఆఫోన్‌కి కాల్‌ చేశా. అప్పటివరకు ఫోన్‌ ఎత్తని వ్యక్తి.. తర్వాత చేసేది లేక కాల్ ఎత్తి.. మసీదు గేట్‌ నంబర్‌ 2 దగ్గరకు వచ్చి రిసీవ్‌ చేసుకోవాలని చెప్పాడు. నేను వెళ్లగానే రెండు ఫోన్లూ నా చేతికిచ్చాడు.

‘కిందపడిపోతే తీసుకున్నా’ అని చెప్పాడు. నా ఫోన్లు నాకు దొరికేసరికి నేనూ ఏం మాట్లాడలేదు. కాస్త ఓపిగ్గా ఆలోచించడం మూలంగానే నా ఫోన్లు నాకు దొరికాయి. అదే ఆ దొంగ కాస్త తెలివైనవాడు అయితే నా ఫోన్లు అంతే!’’ అంటూ పోస్ట్‌ పెట్టాడు. ‘బాగా చెప్పావ్‌ బ్రో’ అంటూ ఒకరు.. ‘ఈ ట్రిక్‌ రివీల్ చేసి లేనిపోని ఐడియాలు ఇవ్వకు బ్రో’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు