AC Buying Guide: ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..!

AC Buying Guide: ఎండలు మండిపోతున్నాయి. ఏటా ఉష్ణోగ్రతలు ఎగబాకుతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది ఏసీలు కొనాల్సిన పరిస్థితి వస్తోంది. మరి కొనే ముందు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం..!

Updated : 02 Apr 2024 12:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఏటా ఎండకాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు గరిష్ఠాలకు చేరుతున్నాయి. దీంతో ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఎయిర్‌ కండిషనర్లు (Air Conditioner - AC) ఇప్పుడు దాదాపు అవసరంగా మారిపోయాయి. అయితే, సరైన ఏసీ కొనుగోలు చేయలేకపోతే అధిక విద్యుత్తు బిల్లు, గదిని చల్లబర్చడంలో ఇబ్బందుల వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని కొనుగోలు చేసే ముందు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం..

ఎలాంటి గది..

ఎలాంటి గదిలో ఏసీ (Air Conditioners) ఉండాలనుకుంటున్నారనేది చాలా ముఖ్యం. పిల్లల గది, మాస్టర్‌ బెడ్‌రూం, లివింగ్‌ రూం.. ఇలా వాడే ప్రదేశాన్ని బట్టి ఏసీ రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 120 చదరపు అడుగుల కంటే తక్కువ పరిమాణం ఉండే చిన్న రూం అయితే ఒక టన్ను సామర్థ్యం ఉన్న ఏసీ సరిపోతుంది. 120-200 చ.అడుగులకు 1-2 టన్నులు, లివింగ్‌ రూం వంటి 200 చ.అడుగుల కంటే పెద్ద గదులకు రెండు టన్నులు అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకోవాలి.

ఏసీ రకం..

  • విండో ఏసీ: సింగిల్‌ రూమ్‌ కోసం ఎక్కువగా వీటిని వాడతారు. అన్ని పరికరాలు ఒకే బాక్స్‌లో అమర్చి ఉంటాయి. దీన్ని బిగించడం చాలా సులభం. కిటికీలో లేదా గోడకు ఉండే ఓపెనింగ్‌లో దీన్ని అమర్చొచ్చు. శబ్దం అధికంగా వస్తుంది. ధర తక్కువ.
  • స్ప్లిట్‌ ఏసీ: పేరుకు తగ్గట్లుగానే దీనిలో రెండు పరికరాలు విడివిడిగా ఉంటాయి. ఒక దాన్ని ఇంట్లో బిగిస్తే మరోదాన్ని వెలుపల అమర్చాలి. కంప్రెసర్‌ బయట అమర్చే భాగంలో ఉంటుంది. దీంతో శబ్దం పెద్దగా ఉండదు. రెండు భాగాలుగా ఉండడం వల్ల దీన్ని బిగించడం కొంచెం శ్రమతో కూడుకొన్న పని.
  • హాట్‌ అండ్‌ కోల్డ్‌ ఏసీ: అన్ని వాతావరణ పరిస్థితులకు ఈ ఏసీ సరిపోతుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు గదిని చల్లబరుస్తుంది. శీతాకాలంలో వెచ్చదనాన్నీ అందిస్తుంది.
  • పోర్టబుల్‌ ఏసీ: అవసరానికి అనుగుణంగా ఏ గదికి కావాలంటే అక్కడికి ఎలాంటి శ్రమ లేకుండా దీన్ని తరలించొచ్చు.
  • టవర్‌ ఏసీ: పెద్ద గదులు లేదా కమర్షియల్‌ ప్లేస్‌లను వేగంగా కూల్‌ చేసేందుకు టవర్‌ ఏసీలు ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ ఫీచర్లు ఉన్నాయా?

  • ఎయిర్‌ ఫిల్టర్లు ఉంటే ఎలాంటి దుమ్ము చేరదు. తద్వారా అలర్జీల వంటివి దరిచేరవు.
  • ఆటో క్లీన్‌ ఫీచర్‌ వల్ల ఏసీ దానికదే శుభ్రం చేసుకుంటుంది. దీంతో బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి.
  • గది తేమ, తడితో నిండిపోకుండా ఏసీలో డీహ్యుమిడిఫికేషన్‌ ఫీచర్‌ ఉండాలి.
  • వీటితో పాటు స్మార్ట్‌ కనెక్టివిటీ, ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీస్‌, ఆటో స్టార్ట్‌, ఫోర్‌-వే స్వింగ్‌, టర్బో మోడ్‌, స్లీప్‌ అలార్మ్‌ వంటి ఫీచర్లు కూడా ఉండేలా చూసుకోవాలి.

స్టార్‌ రేటింగ్‌..

అన్ని ఏసీల సామర్థ్యం ఒకేలా ఉండదు. ముఖ్యంగా అవి విద్యుత్తును వాడుకునే విషయంలో తేడాలుంటాయి. దీన్ని స్టార్‌ రేటింగ్‌ ఆధారంగా సూచిస్తారు. ఒక స్టార్‌ ఉన్న ఏసీతో పోలిస్తే 4, 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన వాటిపై ఎక్కువ విద్యుత్తు బిల్లు ఆదా అవుతుంది. రేటింగ్‌ పెరిగే కొద్దీ విద్యుత్తు వినియోగం తగ్గుతుంది.

ఇన్వర్టర్‌ ఏసీ..

ఇన్వర్టర్‌ ఏసీలో గది చల్లదనాన్ని బట్టి కంప్రెసర్‌ పనిచేస్తుంది. ఎక్కువ వేడి ఉన్నప్పుడు కంప్రెసర్‌ అధికంగా పనిచేయాల్సి ఉంటుంది. రూమ్‌ కూల్‌గా ఉంటే దానిపై లోడ్‌ తక్కువగా ఉంటుంది. అందుకనుగుణంగానే విద్యుత్తు వినియోగం కూడా ఉంటుంది. దీంతో మొత్తంగా విద్యుత్తు వినియోగం తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు