e-Sanjeevani App: ప్రధాని మెచ్చిన ఈ-సంజీవని యాప్‌.. ఎలా పనిచేస్తుంది?

కరోనా (Covid-19) సమయంలో దూర ప్రాంతాలవారు, ప్రయాణ సౌకర్యంలేని ప్రాంతాల్లో నివసించేవారు అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ల నుంచి వైద్య సలహాలను పొందేందుకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health) ఈ-సంజీవని యాప్‌ను పరిచయం చేసింది.

Updated : 28 Feb 2023 17:07 IST

దిల్లీ: భారత్‌ డిజిటల్‌ విప్లవ సామర్థ్యాన్ని ఈ - సంజీవని (e-Sanjeevani) యాప్‌ ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Naredra Modi) అన్నారు. ఇప్పటి వరకు ఈ యాప్‌ ద్వారా 10 కోట్ల మందికిపైగా భారతీయులు లబ్ధి పొందారని తెలిపారు. ఆదివారం 98వ ఎడిషన్ మన్‌కీ బాత్‌ (Mann Ki Baat)లో మాట్లాడుతూ ప్రధాని ఈ యాప్‌ గురించి ప్రస్తావించారు. ఇంతకీ ఈ-సంజీవని యాప్‌ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఈ యాప్‌ ద్వారా దేశ ప్రజలు ఎలాంటి సేవలను పొందవచ్చనేది చూద్దాం. 

కరోనా (Covid-19) సమయంలో దూర ప్రాంతాలవారు, ప్రయాణ సౌకర్యంలేని ప్రాంతాల్లో నివసించేవారు అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ల నుంచి వైద్య సలహాలను పొందేందుకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health) ఈ యాప్‌ను పరిచయం చేసింది. వెబ్‌ పోర్టల్‌, యాప్‌ వెర్షన్లలో ఈ-సంజీవని అందుబాటులో ఉంది. 

ఈ యాప్‌ ద్వారా డాక్టర్‌-టు-డాక్టర్‌, పేషంట్‌-టు-డాక్టర్‌ ఒకరితో ఒకరు అనుసంధానం కావొచ్చు. జాతీయ టెలీమెడిసిన్‌ సర్వీస్‌ ఆఫ్‌ ఇండియా(National Telemedicine Service of India)గా పేరుగాంచిన ఈ యాప్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే అతి పెద్ద టెలీమెడిసన్‌ వ్యవస్థని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

  • యూజర్లు ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌ (PlayStore), యాపిల్ యాప్‌ స్టోర్‌ (App Store) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత  పేషెంట్ రిజిస్ట్రేషన్‌/జనరేట్ టోకెన్‌ (Patient Registration/Generate Token), పేషెంట్ లాగిన్‌ (Patient Login), పేషెంట్ ప్రొఫైల్‌ (Patient Profile) అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • వాటిలో పేషెంట్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి యూజర్‌ తన రాష్ట్రాన్ని సెలెక్ట్‌ చేయాలి. తర్వాత రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, కొవిడ్ కేంద్రాలకు సంబంధించిన ఓపీడీ సమయాల పూర్తి సమాచారం ఉంటుంది.
  • అందులో యూజర్‌ సంప్రదించాలనుకుంటున్న స్పెషలిస్ట్‌ డాక్టర్‌ (అంటే జనరల్‌ మెడిసన్‌/కార్డియో/ఈఎన్‌టీ/న్యూరాలజీ వంటి వాటితోపాటు ఇతర విభాగాలు)ను ఎంపిక చేసుకోవాలి.

  • తర్వాత ఓటీపీతో మొబైల్‌ నంబర్‌ను వెరిఫై చేస్తే యూజర్‌కు సంబంధించి టోకెన్ జనరేట్ అవుతుంది. దాంతో లాగిన్ చేసి యూజర్‌ పేరు, ఇతర వివరాలతోపాటు మెడికల్‌ రిపోర్ట్‌లు వంటి ఏవైనా ఉంటే వాటిని అప్‌లోడ్ చేయొచ్చు.
  • వివరాలు నమోదు చేసిన తర్వాత సబ్‌మిట్‌ చేస్తే పేషెంట్ ఐడీతో  డాక్టర్‌తో అపాయింట్‌మెంట్‌ టైమ్‌ను ఎస్సెమ్మెస్ ద్వారా తెలియజేస్తుంది. అందులో సూచించిన సమయానికి ఆన్‌లైన్‌లో కాల్‌ నౌ (Call Now) బటన్‌పై క్లిక్‌ చేసి డాక్టర్‌ను సంప్రదించి వైద్య సలహాలు పొందవచ్చు. డాక్టర్‌ లైవ్‌ సెషన్‌ ముగిసిన తర్వాత ఈ-ప్రిస్క్రిప్షన్‌ (ePrescription) ద్వారా అవసరమై మందులు కొనుగోలు చేయొచ్చు.
  • పేషెంట్ లాగిన్‌ (Patient Login)/ పేషేంట్‌ ప్రొఫైల్‌(Patient Profile) సెక్షన్లలో పేషెంట్ ఐడీ, టోకెన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయమని సూచిస్తుంది. అవి ఎంటర్‌ చేసి పేషెంట్‌ అందిన వైద్యానికి సంబంధించిన వివరాలను చూడొచ్చు.

కొన్నిరాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని విభాగాల సేవలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తుంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ-సంజీవని కొవిడ్‌ కేంద్రాలు, ఈఎస్‌ఐ ఆస్పత్రుల వివరాలను మాత్రమే చూపిస్తుంది. వాటిలో కొన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు చూపిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు