Budget: తాత్కాలిక బడ్జెట్‌పైనా ఆశలు ఇందుకే.. గత అనుభవాలివీ..!

Union budget 2024: తాత్కాలిక పద్దు అయినప్పటికీ.. గతంలో కొన్ని ప్రజాకర్షక నిర్ణయాలు వెలువడ్డాయి. ఇప్పుడూ అదే ఆనవాయితీ కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి.

Updated : 29 Jan 2024 19:40 IST

Union budget 2024 | ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక సమరానికి ముందు భాజపా సర్కారు తాత్కాలిక బడ్జెట్‌ (Union budget 2024)ను ప్రవేశపెట్టబోతోంది. మూడోసారి అధికారం చేపట్టాలన్న ఆకాంక్షల మధ్య ఈ బడ్జెట్‌ తీసుకొస్తోంది. ఈసారి బడ్జెట్‌లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండకపోవచ్చంటూ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) కొన్ని రోజుల ముందు కీలక ప్రకటన చేశారు. తాత్కాలిక బడ్జెట్ కాబట్టి పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. నిర్మలమ్మ చెప్పినట్లు తాత్కాలిక బడ్జెట్‌లో కొత్త పథకాలు, స్కీములు, పన్నుల్లో మార్పులు వంటివి పెద్దగా ఉండవు. ఎన్నికల అనంతరం కొలువుదీరే కొత్త ప్రభుత్వానిదే వాటి బాధ్యత. కానీ, ఈ సంప్రదాయానికి ఎప్పుడో తెరపడింది. ఎన్నికల ముందు వచ్చే తాత్కాలిక బడ్జెట్‌లోనూ కీలక ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఎన్నికల ముందు ప్రజాకర్షక పథకాలు, ఓటర్లను ఆకట్టుకునే నిర్ణయాలు తీసుకోవడం 20 ఏళ్ల క్రితమే మొదలైంది. 2004 ఎన్డీయే ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి జశ్వంత్‌సింగ్‌.. తాత్కాలిక బడ్జెట్‌లో కీలక నిర్ణయం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకోవడానికి 50 శాతం డియర్‌నెస్‌ అలవెన్సును (DA) ఐదో వేతన సంఘం సిఫార్సుల మేరకు మూలవేతనంలో కలుపుతూ నిర్ణయం ప్రకటించారు. అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారుల కుటుంబాల సంఖ్యను 1.5 కోట్ల నుంచి 2 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

బడ్జెట్‌లో ఇంటికి ఏ మేరకు దన్ను?

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం సైతం తాత్కాలిక బడ్జెట్‌లో ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. 2009లో నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని 10 నుంచి 8 శాతానికి, సర్వీస్‌ ట్యాక్స్‌ను 12 నుంచి 10 శాతానికి తగ్గించారు. 2014లో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన చిందంబరం.. కొన్నింటిపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించారు. క్యాపిటల్‌ గూడ్స్‌, కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌, టూవీలర్లు, కార్లు, కమర్షియల్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్లపై తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునేలా 2014 జూన్‌ 30 వరకే అమలయ్యేలా బడ్జెట్‌లో ప్రకటన చేశారు.

యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల అనంతరం భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మళ్లీ కొలువుదీరింది. 2019లో ఎన్నికలకు ముందు పీయూష్‌ గోయల్‌ ఆర్థికమంత్రిగా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తన బడ్జెట్‌ ప్రసంగంలో రైతులను ఆకట్టుకునేలా ప్రధాన్‌మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రకటించారు. ఏటా రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో వేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సూచన మేరకు చివరి నిమిషంలో చేర్చినట్లు చెబుతుంటారు. అలాగే, పన్ను ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్నవారికి పన్ను రిబేటును ఇదే బడ్జెట్‌లో ప్రకటించారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ను సైతం రూ.40వేల నుంచి రూ.50 వేలకు పెంచుతూ నిర్ణ్ణయం తీసుకున్నారు. 

ఇక 2024లో ఏప్రిల్‌- మే నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో పీఎం-కిసాన్‌ కింద ఇచ్చే మొత్తాన్ని పెంచుతారన్న అంచనాలు ఉన్నాయి. పట్టణ ప్రజల కోసం పీఎం- ఆవాస్‌ యోజన తరహా పథకం, పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు, విద్యుత్‌ వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు ఉండొచ్చని తెలుస్తోంది. గత కొన్ని బడ్జెట్‌లుగా మౌలిక వసతులపై దృష్టిసారించిన ప్రభుత్వం.. ఈసారి ప్రజలను ఆకట్టుకునేలా ఏవైనా ప్రకటనలు చేస్తుందేమో చూడాలి.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని