Union budget 2024: బడ్జెట్‌లో ఇంటికి ఏ మేరకు దన్ను?

కేంద్ర బడ్జెట్‌ వస్తుందంటే గృహ కొనుగోలుదారుల దగ్గర్నుంచి.. నిర్మాణ రంగం వరకు ఎన్నో ఆశలు.. ఎన్నికల ఏడాది కావడంతో సర్కారు నుంచి గృహ నిర్మాణ రంగానికి భారీగా ప్రోత్సాహకాలు ఉంటాయని ఆశిస్తున్నారు.

Updated : 29 Jan 2024 16:44 IST

నిర్మాణ సంఘాల నుంచి కేంద్రానికి పలు విజ్ఞప్తులు  

కేంద్ర బడ్జెట్‌ వస్తుందంటే గృహ కొనుగోలుదారుల దగ్గర్నుంచి.. నిర్మాణ రంగం వరకు ఎన్నో ఆశలు.. ఎన్నికల ఏడాది కావడంతో సర్కారు నుంచి గృహ నిర్మాణ రంగానికి భారీగా ప్రోత్సాహకాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఆదాయ పన్నులో రాయితీలు, జీఎస్‌టీ తగ్గింపు, సరసమైన గృహాల విస్తీర్ణం పెంపు వంటి ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రికి కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) అందజేసింది.

గృహరుణం అసలు చెల్లింపుపై ఆదాయ పన్ను 80సి కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంది. దీన్ని పెంచాలని క్రెడాయ్‌ కోరింది. పిల్లల ట్యూషన్‌ ఫీజులు, బీమా పాలసీలు కూడా 80సి కిందకే వస్తాయి. లక్షన్నర మినహాయింపు ఈ రెండింటికే సరిపోతుంది. దీంతొ వేతనజీవులు క్లెయిం చేసుకోలేకపోతున్నారు. పరిమితి పెంచడం లేదంటే ప్రత్యామ్నాయంగా గృహరుణ అసలు చెల్లింపును వేరేగా పరిగణించాలనే సూచనలు వచ్చాయి.

గృహ రుణ వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు ఆదాయ పన్ను సెక్షన్‌ 24(బి) ప్రకారం మినహాయింపు ఉంది. ఇళ్ల ధరలు పెరిగిన తర్వాత తీసుకునే రుణ మొత్తం పెరిగింది. చెల్లిస్తున్న వడ్డీ లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో ఆ మొత్తాన్నీ పెంచాలని క్రెడాయ్‌ కోరింది.  నివాసం ఉండేందుకు మొదటిసారి ఇల్లు కొంటుంటే అసలుపై పరిమితి లేకుండా మొత్తానికి ఆదాయ పన్ను మినహాయించాలనే ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి. లేకపోతే అసలుపై రూ.5 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని ప్రత్యామ్నాయాలను సూచించారు.

సరసమైన ఇళ్ల  విస్తీర్ణం పెంచాలి..

కేంద్ర ప్రభుత్వం సరసమైన ఇళ్లను 60 చదరపు మీటర్ల లోపు ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకొంటుంది. ఇంటి ధర కూడా రూ.45 లక్షలు మించవద్దని 2017లో ప్రకటించింది. ఈ ప్రకారం ఉన్న వాటిని సరసమైన ఇళ్లుగా నిర్వచించి.. జీఎస్‌టీ 1 శాతం వర్తింపజేస్తోంది. అప్పటికి ఇప్పటికి  పరిస్థితులు మారినందున విస్తీర్ణం పెంచాలని క్రెడాయ్‌ కోరింది.  నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు ప్రకారం గత ఏడేళ్లలో ఇళ్ల ధరలు 24 శాతం పెరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని పరిమితి ధరతోపాటూ విస్తీర్ణం పెంచాలని విజ్ఞప్తి చేసింది. మెట్రో నగరాల్లో 60 నుంచి 90 చదరపు మీటర్లకు(రెరా కార్పెట్‌ ఏరియా), మెట్రోయేతర నగరాల్లో 120 చదరపు మీటర్లకు పెంచాలని సూచించింది.

పరిశ్రమ  హోదా..

దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్న అంశాల్లో రియల్‌ ఎస్టేట్‌కు పరిశ్రమ హోదా ఒకటి.  హోదా వస్తే  రుణాల లభ్యత పెరుగుతుంది. ప్రస్తుతం బిల్డర్లు అధిక వడ్డీరేట్లకు రుణాలు పొందుతున్నారు. లభ్యత కూడా క్లిష్టంగా ఉంది. పరిశ్రమ హోదా వస్తే ప్రాధాన్య రంగంగా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కావడమే కాకుండా.. వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయని బిల్డర్లు అంటున్నారు.  అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న స్థిరాస్తి రంగానికి ఎంతో ప్రయోజనం జరుగుతుందని చెబుతున్నారు.

 ఈనాడు, హైదరాబాద్‌


విస్తీర్ణం పెంచితే ప్రయోజనం..

సరసమైన ఇళ్లకు 60 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా అంటే 645 చ.అ.వస్తుంది. మనం బిల్టప్‌ విస్తీర్ణం ప్రకారం చూస్తే 750 చదరపు అడుగులు. ఈ విస్తీర్ణంలో కడితే కొనడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. కార్పెట్‌ ఏరియా 90 చదరపు మీటర్లకు పెంచాలని క్రెడాయ్‌ నేషనల్‌ కేంద్రాన్ని కోరింది. అప్పుడు బిల్టప్‌ ఏరియా 1200 చదరపు అడుగుల వరకు వస్తుంది. కట్టేవారికి, కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటుంది. జీఎస్‌టీ 1 శాతానికి తగ్గుతుంది కాబట్టి కొనుగోలుదారులపై భారం పడదు. రుణ ఆధారిత సబ్సిడీని ఎల్‌ఐజీతో పాటూ సరసమైన గృహాలను కొనుగోలు చేసే వర్గాలకు వర్తింపజేయాలి. ఇదివరకు ఉండేది. మళ్లీ పునరుద్ధరించాలని కోరుతున్నాం. ఎన్నికల ఏడాదిలో వీటిపై సానుకూల నిర్ణయాలు వస్తాయని ఆశిస్తున్నాం.

ఎన్‌.జైదీప్‌రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌,క్రెడాయ్‌ హైదరాబాద్‌


పీఎంఏవైతో ఈఎంఐ భారం తగ్గించాలి

మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సొంతిల్లు ఒక బలీయమైన ఆకాంక్ష. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) ద్వారా చర్యలు తీసుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఎంతోమంది ఇంటి కలకు దూరంగానే ఉన్నారు. స్థోమత అనేది పెద్ద సవాల్‌గా మారింది. మధ్యంతర బడ్జెట్‌లో ఈ వర్గానికి మరింతగా తోడ్పాటు ఇవ్వాలి.

  • పీఎంఏవై పథకం కింద అర్హత కలిగిన కొనుగోలుదారులకు గృహరుణంపై వడ్డీ రాయితీలను రూ.2.3 లక్షల నుంచి రూ.2.7 లక్షల వరకు పరిమితం చేశారు. స్థోమత మద్దతు ఇవ్వడానికి పథకం పరిధి, సబ్సిడీ పెంచడం ద్వారా పట్టణ ప్రాంతవాసులకు ప్రయోజనం కలుగుతుంది. నివాస ధరలను పరిగణనలోకి తీసుకుని గృహ కొనుగోలు ఈఎంఐ భారం తగ్గించడానికి, స్థోమత పెంచడానికి ఉపయోగపడుతుంది.
  • అద్దె గృహాలను ప్రోత్సహించాలి. రూ.50 లక్షల లోపు గృహాలపై రూ.3లక్షల వరకు అద్దె ఆదాయం 100 శాతం పన్ను మినహాయింపును బడ్జెట్‌లో ప్రవేశపెట్టాలి. దీంతో గృహాల కొరతతో ఎక్కువగా ప్రభావితమైన విభాగంలో అద్దె వసతిని పెంచుతుంది.
  • భూమి ధరలు అధికంగా ఉండటంతో సరైన ప్రదేశంలో సరసమైన గృహాల అభివృద్ధి పెద్ద సవాల్‌గా మారింది. మార్కెట్‌ శక్తులు ఆయా ప్రదేశాల్లో ఆస్తులను తక్కువ ధరకు అమ్మడానికి ఒప్పుకోవు. కాబట్టి వీటిపై ప్రభుత్వ నియంత్రణ అవసరం. ప్రభుత్వ యాజమాన్యంలోని భూమిని అధిక సాంద్రత కలిగిన ప్రాంతాల్లో అద్దె గృహాల అభివృద్ధికి వినియోగించవచ్చు.

 శిశిర్‌ బైజాల్‌, ఎండీ, నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని