Whatsapp: వాట్సప్‌లో యూజర్‌ నేమ్‌.. చాట్స్‌కు సీక్రెట్‌ కోడ్‌!

Whatsapp new features: వాట్సప్‌లో త్వరలో యూజర్‌ నేమ్‌ సదుపాయం రాబోతోంది. అలాగే ఎంపిక చేసిన చాట్స్‌ను లాక్‌ చేసిన వాటికి సీక్రెట్ కోడ్‌ పెట్టుకునే సదుపాయాన్ని వాట్సప్‌ తీసుకొస్తోంది.

Published : 02 Dec 2023 14:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మెటాకు చెందిన వాట్సప్‌ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చే అంశంలో దూకుడు మీద ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, డిజైన్‌లో మార్పులను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు యూజర్‌నేమ్‌ సెర్చ్ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఫోన్‌ నంబర్లకు బదులు యూజర్‌ నేమ్‌ను షేర్‌ చేసుకునేందుకు ఈ ఫీచర్‌ కల్పించనుంది. ప్రస్తుతానికి డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ఎంపిక చేసిన బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఎవరైనా మనతో వాట్సప్‌లో చాట్‌ చేయాలంటే ఫోన్‌ నంబర్‌ తప్పనిసరి. కొందరికి వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ ఇవ్వడం ఇష్టం ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై యూజర్లు ఫోన్‌ నంబర్‌కు బదులు యూజర్‌ నేమ్‌ ఇస్తే సరిపోతుంది. సెర్చ్‌ బార్‌లో సంబంధిత యూజర్‌ నేమ్‌ ఎంటర్‌ చేస్తే యూజర్‌తో కనెక్ట్‌ కావొచ్చు. ఫోన్‌ నంబర్‌ పంచుకోవడం ఇష్టం లేని వ్యక్తులు ఈ యూజర్‌ నేమ్‌ను షేర్‌చేసుకోవచ్చు. యూజర్‌ నేమ్‌ను వ్యక్తులు తమకు నచ్చినది ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్‌ కూడా చేసుకోవచ్చు. ఫోన్‌ నంబర్‌ పంచుకోవడంలో ఇబ్బంది లేదనుకుంటే ఎప్పటిలానే మొబైల్‌ నంబర్‌ను షేర్‌ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

Tech tip: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌.. స్పీడ్‌ చలాన్‌లకు ఇక చెక్‌

మరోవైపు వాట్సప్‌లో ఎంపిక చేసిన చాట్స్‌కు లాక్‌ వేసుకునే సదుపాయాన్ని మెటా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా సీక్రెట్‌ కోడ్‌ సదుపాయాన్ని దానికి జోడించింది. ఈ ఫీచర్‌ ద్వారా చాట్‌లాక్‌ కోసం ప్రత్యేకంగా సీక్రెట్‌ కోడ్‌ పెట్టుకోవచ్చు. అంటే ఆయా చాట్స్‌ ఓపెన్‌ చేయాలంటే ఈ సీక్రెట్‌ కోడ్‌ ఎంటర్‌ చేయడం తప్పనిసరి. అంకెలు, అక్షరాలు, ఎమోజీలు కోడ్‌గా పెట్టుకోవచ్చు. ఈ కోడ్‌ను సెర్చ్‌బార్‌లో ఎంటర్‌ చేసినప్పుడు మాత్రమే లాక్‌ చేసి ఉంచిన చాట్స్‌ కనిపిస్తాయి. అంటే ఇతర వ్యక్తులెవరైనా మన ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేసినా.. వాట్సప్‌ ఓపెన్‌ చేసినప్పుడు లాక్‌ అయిన చాట్స్‌ను మాత్రం చూడలేరు. త్వరలో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుందని ఎక్స్‌లో వాట్సప్‌ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని