Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్‌విస్‌ సీఈఓ

Edelweiss CEO Radhika Gupta Zomato, Swiggy: మ్యుచువల్‌ ఫండ్స్‌ సంస్థ ఎడిల్‌విస్‌ సీఈఓ రాధికా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటోతోనే పోటీ అని అన్నారు.

Published : 09 Dec 2023 13:33 IST

Swiggy - Zomato | ఇంటర్నెట్ డెస్క్‌: భవిష్యత్‌ అవసరాల కోసం ఎంతోకొంత దాచుకోవాలని ఒకప్పటి తరం యువతకు సూచించేది. ఇప్పుడంటే అనేక పెట్టుబడి సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నెల నెలా ఎంతో కొంత మొత్తాన్ని క్రమానుగత పెట్టుబడి విధానం (SIP)లో మదుపు చేయాలని చాలా మంది చెబుతుంటారు. ప్రస్తుతం దేశంలో సుమారు 4 కోట్ల మంది ఇన్వెస్టర్లు సిప్‌ పద్ధతిలో వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎడిల్‌విస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్‌తోనే పోటీ అంటున్నారు. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు అధినేత అయిన ఆమె ఎందుకలా అన్నారు?

బాంబే షేవింగ్‌ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్‌పాండే ‘ది బార్బర్‌షాప్‌ విత్‌ శంతను’ పేరిట నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో రాధికా గుప్తా తాజాగా మాట్లాడారు. యువతకు పొదుపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇండస్ట్రీ స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్‌ వంటి కంపెనీలతో పోటీ పడుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

40 ఏళ్లు అలాగే పనిచేశా.. ‘70 పనిగంటల’ను సమర్థించుకున్న నారాయణమూర్తి

‘‘ఎవరైనా నెలకు రూ.50-60 వేలు సంపాదిస్తూ ఉంటే అందులో నెలకు ఎంతో కొంత పొదుపు చేయండి. చాలా మంది తగినంత మొత్తం లేక సిప్ విధానంలో కనీసం రూ.100 కూడా పెట్టుబడి పెట్టలేకపోతున్నామని నాతో చెప్తుంటారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌కు నెలకు రూ.100 కడుతుంటారు. దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలు, స్విగ్గీ, జొమాటోకు 40 కోట్ల మంది కస్టమర్లు ఉంటే.. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇండస్ట్రీలో కేవలం 4 కోట్ల మంది మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. అందుకే స్విగ్గీ, జొమాటోతోనే మా పోటీ’’ అని రాధికా గుప్తా అన్నారు. ‘‘ఒకప్పటి తరం బతకడానికి చాలా కష్టపడే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆదాయాలు పెరిగాయి. ఇప్పటి తరానికి ఆదాయానికి కొదవ లేదు. కానీ వారిలో పొదుపు చేయాలన్న భావన కనిపించడం లేదు’’ అని రాధికా గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్‌ కోసం యువత ఎంతో కొంత మదుపు చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని