ICICI Bank: అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్‌.. లాభం 40 శాతం వృద్ధి

ICICI Bank Q1 results: ఐసీఐసీఐ బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. నికర లాభంలో 40 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Published : 22 Jul 2023 16:49 IST

ముంబయి: ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్‌ ఐసీఐసీఐ (ICICI Bank) త్రైమాసిక ఫలితాల్లో (Q1 results) ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది రూ.6,905 కోట్లుగా ఉన్న లాభం ఈ సారి రూ.9,648 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.13,210 కోట్ల నుంచి 38 శాతం వృద్ధి చెంది రూ.18,227 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ ఆస్తుల నిర్వహణ సైతం మెరుగైంది. ఎన్‌పీఏలు గణనీయంగా తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 3.4 శాతంగా ఉన్న స్థూల ఎన్‌పీఏలు 2.76 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.70 శాతం నుంచి 0.48 శాతానికి తగ్గాయి.

28 నుంచి ola s1 air బుకింగ్స్‌.. వీళ్లకు రూ.10వేలు తక్కువకే..

యెస్‌ బ్యాంక్‌ లాభం 10 శాతం వృద్ధి

ఎస్‌బీఐ నియంత్రణలో ఉన్న యెస్‌ బ్యాంక్‌ సైతం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాది రూ.311 కోట్లుగా ఉన్న నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.343 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.5,876 కోట్ల నుంచి రూ.7,584 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.5,135 కోట్ల నుంచి రూ.6,443 కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ తెలిపింది. స్థూల ఎన్‌పీఏలు 13.4 శాతం నుంచి 2 శాతానికి, నికర ఎన్‌పీఏలు 4.2 శాతం నుంచి 1 శాతానికి తగ్గాయి.

కోటక్‌ లాభం 67 శాతం జంప్‌

స్టాండలోన్‌ పద్ధతిలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నికర లాభంలో 67 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది రూ.2,071 కోట్లుగా ఉన్న నికర లాభం రూ.3,452 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం సైతం 33 శాతం వృద్ధితో రూ.6234 కోట్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని