జులై 28 నుంచి ola s1 air బుకింగ్స్‌.. వీళ్లకు రూ.10వేలు తక్కువకే..

Ola S1 Air: విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌  కొత్త ఓలా s1 air బుకింగ్స్‌ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పాత కస్టమర్లకు ఓలా ఆఫర్‌ కూడా ప్రకటించింది.

Published : 22 Jul 2023 11:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) తన s1 air ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. MoveOS-3 ఫీచర్‌తో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌ బుకింగ్స్‌ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే, ఓలా పాత కస్టమర్లు, ఇంతకుముందే ఓలా s1 air కోసం రిజర్వ్‌ చేసుకున్న వారు మాత్రమే జులై 28 నుంచి 30 వరకు జరగనున్న ప్రీ బుకింగ్‌ ఆర్డర్లలో స్కూటర్‌ కోసం బుక్‌ చేసుకోవచ్చు. వీరికి ధరలో కొంత తగ్గింపు కూడా ప్రకటించారు.

దీని ధర రూ.1,19,999 (ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రీ బుకింగ్‌ నిర్వహించనున్న మూడు రోజుల్లో బుక్‌ చేసుకున్న వారికి రూ.10వేల తగ్గింపుతో రూ.1,09,999 కే ఓలా s1 air లభిస్తుంది. ఆ తర్వాత జులై 31 నుంచి ఇతర వినియోగదారులు ఈ స్కూటర్‌ కోసం బుక్‌ చేసుకోవచ్చు. అయితే వీరికి ధర రూ.1,19,999గా ఉంటుంది. ఆగస్టు నుంచి స్కూటర్ల డెలివరీని ప్రారంభించనున్నట్లు భవీశ్ తెలిపారు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఓలా s1 air MoveOS-3 ఫీచర్‌తో రానుంది. 2.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు హబ్‌ మౌంటెడ్ మోటర్‌ను కలిగి ఉంటుంది. ఈ విద్యుత్‌ స్కూటర్‌ను ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 9.8 సెకన్లలో 60 kmph వేగాన్ని అందుకుంటుంది. గంటకు 90 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. కేవలం 4:50 గంటల్లో బ్యాటరీని ఫుల్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చు.

బ్యాంకులూ వారానికి 5 రోజులే!

Ola S1 ఎయిర్ ముందు భాగంలో స్టాండెడ్‌ టెలిస్కోపిక్ సస్పెన్షన్ , వెనుకవైపు షాక్ అబ్జార్బర్‌లతో ఉంటుంది. సీటు కింద 34 లీటర్ల బూట్‌స్పేస్‌ అందిస్తున్నారు. తక్కువ బరువు ఉండేలా ఈ స్కూటర్‌ను డిజైన్‌ చేశారు. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ అందిస్తున్నారు. వీటితో పాటు ఎకో, నార్మల్‌, స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఇస్తున్నారు. పాసిలెన్‌ వైట్‌, లిక్విడ్ సిల్వర్‌, మిడ్‌నైట్‌ బ్లూ, కోరల్‌ గ్లామ్ రంగుల్లో లభిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్‌ యాప్‌/వెబ్‌సైట్‌ ద్వారా గానీ రూ.999 కట్టి స్కూటర్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని