చైనాకు తగ్గి.. భారత్‌కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస

అనేక పాశ్చాత్య దేశాల సంస్థలు తమ పెట్టుబడులను పెట్టేందుకు భారత్‌ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు పేర్కొన్నారు.

Published : 17 May 2024 15:26 IST

ఐక్యరాజ్యసమితి: భారత్‌ గణనీయమైన ఆర్థికవృద్ధిని చూస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు పేర్కొన్నారు. చైనాకు విదేశీ పెట్టుబడులు చాలా తక్కువగా నమోదవుతున్నాయని.. దీంతో అనేక పాశ్చాత్య దేశాల సంస్థల పెట్టుబడులకు భారత్‌ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందన్నారు. 2024 దేశ వృద్ధిరేటు అంచనాలను సవరించిన నేపథ్యంలో ఐరాస నిపుణుడు ఈవిధంగా మాట్లాడారు.

‘‘పాశ్చాత్య దేశాలతోపాటు విదేశాల నుంచి చైనాకు పెట్టుబడులు చాలావరకు తగ్గాయి. ఈ క్రమంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో భారత్‌ ఎంతో లబ్ధి చెందుతోంది. పశ్చిమదేశాల కంపెనీలకు వనరులు లేదా ప్రత్యామ్నాయ పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. ఇది భారత్‌కు లబ్ధి చేకూరుస్తోంది’’ అని ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగానికి చెందిన హమీద్‌ రషీద్‌ పేర్కొన్నారు. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అంచనాలు 2024’కు సంబంధించి తాజా సవరణలను వెల్లడించిన ఆయన.. దేశ ఆర్థికవృద్ధి రేటు 7 శాతానికి చేరువలో నమోదవుతుందని అంచనా వేశారు.

వరల్డ్‌ ‘సూపర్‌-రిచ్‌’లో 15 మంది.. జాబితాలో అదానీ

‘‘భారత్‌ వృద్ధి రేటు 2024లో 6.9శాతం, 2025లో 6.6 శాతంగా నమోదు చేసుకుంటుందని అంచనా. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినియోగ సామర్థ్యం స్థిరంగా కొనసాగుతుండటం ఇందుకు దోహదం చేస్తుంది. ఔషధ, రసాయనాల ఎగుమతులు మరింత బలంగా విస్తరిస్తాయి. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. ఇతర దేశాల మాదిరిగా ఆర్థికస్థితి కృత్రిమంగా కనిపించడం లేదు. స్థిరవృద్ధికి అన్నివైపులా మద్దతు లభిస్తోంది. నిజానికి గతేడాది నుంచే ఊపందుకున్న ఈ వృద్ధి.. క్రమంగా కొనసాగుతోంది’’ అని హమీద్‌ రషీద్‌ వివరించారు.

ముడిచమురు ధర విషయంతోపాటు దిగుమతుల కోసం రష్యాతో చేసుకున్న ఏర్పాట్లు కూడా భారత్‌కు ఎంతో దోహదం చేస్తున్నాయని ఐరాస ప్రతినిధి పేర్కొన్నారు. భారత్‌తోపాటు బ్రెజిల్‌లోనూ బలమైన వృద్ధి రేటు చూశామన్నారు. చైనా వృద్ధి రేటును ఈ జనవరిలో 4.7శాతంగా అంచనా వేయగా.. తాజాగా అది స్పల్పంగా పెరిగి 4.8శాతంగా ఉండనుందన్నారు. పలు రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. అక్కడి ప్రాపర్టీ రంగం డ్రాగన్‌కు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు