Super Rich Club: వరల్డ్‌ ‘సూపర్‌-రిచ్‌’లో 15 మంది.. జాబితాలో అదానీ

Super Rich Club: 100 బిలియన్‌ డాలర్ల సంపద కలిగిన వ్యక్తులను సూపర్‌-రిచ్‌గా వ్యవహరిస్తుంటారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం ఈ జాబితాలో ఎప్పుడూ లేనంతగా 15 మంది చేరారు.

Published : 17 May 2024 13:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో 100 బిలియన్‌ డాలర్లకు పైగా సంపద కలిగిన ‘సూపర్‌-రిచ్‌’ క్లబ్‌లో (Super Rich Club) 15 మంది చేరారు. ఈ జాబితాలోకి ఇంతమంది చేరడం ఇదే తొలిసారి. వీరిలో భారత్‌ నుంచి గౌతమ్‌ అదానీ (Gautam Adani), ముకేశ్‌ అంబానీ కూడా ఉండడం విశేషం. కృత్రిమ మేధ, విలాసవంత వస్తువులకు గిరాకీ, భౌగోళిక రాజకీయాల్లో మార్పుల కారణంగానే వీరందరి సంపద పెరిగింది.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. ‘సూపర్‌-రిచ్‌’ జాబితాలోని 15 మంది సంపద ఈ ఏడాది 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్‌ రాబడులను అధిగమించి వీరి సంపద వృద్ధి చెందింది. ప్రపంచంలోని తొలి 500 మంది సంపన్నుల సంపదలో పావు వంతు ఈ 15 మంది వద్దే ఉండడం గమనార్హం.

ఈ జాబితాలో ఉన్నవారి సంపద గతంలోనే 100 బిలియన్‌ డాలర్లు దాటింది. అయితే, ఒకేసారి వారంతా ఈ మైలురాయికి ఎగువన నిలవడం మాత్రం ఇదే తొలిసారి. లోరియల్‌ ఎస్‌ఏ వారసురాలు ఫ్రాంకోయిస్‌ బెటెన్‌కోర్ట్‌ మేయర్స్‌, డెల్‌ టెక్‌ వ్యవస్థాపకుడు మైకేల్‌ డెల్‌, మెక్సికన్‌ బిలియనీర్‌ కార్లోస్‌ స్లిమ్‌ వీరంతా గత ఐదు నెలల వ్యవధిలోనే 100 బి.డాలర్ల మైలురాయిని అందుకున్నారు. గతంలో ఈ క్లబ్‌లో ఉన్న గౌతమ్‌ అదానీ (Gautam Adani) తిరిగి స్థానం సంపాదించుకున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం ఆయన సంపద భారీగా కుంగిన విషయం తెలిసిందే. దిద్దుబాటు చర్యల కారణంగా అదానీ కంపెనీల షేర్లు పుంజుకున్నాయి. అదే సమయంలో భారత్‌లో విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా కలిసొచ్చింది.

తొలి మహిళ..

100 బి.డాలర్ల మైలురాయిని అందుకున్న తొలి మహిళగా ఫ్రాంకోయిస్‌ బెటెన్‌కోర్ట్‌ నిలిచారు. విలాసవంత సౌందర్య ఉత్పత్తుల కంపెనీ లోరియల్‌ షేర్లు రాణించడం అందుకు దోహదం చేసింది. 101 బిలియన్‌ డాలర్లతో ఆమె 14వ స్థానంలో ఉన్నారు. ఏఐ ఆధారిత పరికరాలకు డిమాండ్‌ పుంజుకోవటంతో మైకేల్‌ డెల్‌ సంపద 113 బి.డాలర్లు దాటింది. ఆయన 11వ స్థానంలో నిలిచారు. లాటిన్‌ అమెరికాలో అత్యంత ధనవంతుడైన కార్లోస్‌ స్లిమ్‌ సంపద 2023లో 28 బిలియన్‌ డాలర్లు పెరిగింది. 106 బి.డాలర్లతో 13వ స్థానంలో ఉన్నారు.

222 బిలియన్‌ డాలర్లతో ఎల్‌వీఎంహెచ్‌ వ్యవస్థాపకుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ 208 బి.డాలర్లు, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ 187 బి.డాలర్లు తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. మస్క్‌ (Elon Musk) సంపద ఈ ఏడాది టెస్లా షేర్ల పతనం కారణంగా 40 బిలియన్‌ డాలర్లు కుంగడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని