crude oil bill: క్రూడాయిల్‌ దిగుమతుల బిల్లు తగ్గింది, కానీ..!

దేశీయ ముడి చమురుల దిగుమతుల బిల్లు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 16 శాతం మేర తగ్గింది.

Published : 17 Apr 2024 19:24 IST

Crude oil bill | దిల్లీ: దేశీయ చమురు అవసరాల కోసం భారత్‌ ఇతర దేశాలపైనే అధికంగా ఆధారపడుతుంటుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దిగుమతి, వినియోగదారుగా ఉన్న భారత్‌.. ఖజానాలోని విదేశీ మారకాన్ని పెద్ద మొత్తంలో దీనికే వెచ్చించాల్సి వస్తోంది. తాజాగా ఈ బిల్లు దిగి వచ్చింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 16 శాతం తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం ఇందుకు కారణం. ఆ సమయంలో అంతర్జాతీయ సరఫరాలపై ఆధారపడడం మరింత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

2023-24 ఆర్థిక సంవత్సరంలో 232.5 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుందని పెట్రోలియం మంత్రిత్వశాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ (PPAC) డేటా చెబుతోంది. ఇలా దిగుమతి చేసుకున్న ముడి చమురునే పెట్రోల్‌, డీజిల్‌గా మార్చి దేశీయంగా వినియోగిస్తుంటారు. అంతకుముందు ఏడాది సైతం దాదాపు ఇంతే మొత్తంలో క్రూడాయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంది. అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులకు గానూ 157.5 బిలియన్‌ డాలర్లు చెల్లించిన భారత్‌.. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం 132.4 బిలియన్‌ డాలర్లు మాత్రమే వెచ్చించింది.

పీఎఫ్‌లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్‌డ్రా

అదే సమయంలో ఇతర దేశాలపై ఆధారపడడం స్వల్పంగా పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 87.4 శాతంగా ఉన్న ఈ మొత్తం.. గత ఆర్థిక సంవత్సరంలో 87.7 శాతానికి పెరిగింది. దేశీయంగా చమురు ఉత్పత్తి ఆ మేరకు తగ్గడమే ఇందుకు కారణం. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఇతర పెట్రోలియం ఉత్పత్తులైన ఎల్‌పీజీ 48.1 మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకోగా.. అందుకు 23.4 బిలియన్‌ డాలర్లను భారత్‌ వెచ్చించింది. 30.91 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకుని 13.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. నికరంగా ఆయిల్‌, గ్యాస్‌ దిగుమతుల బిల్లు ( క్రూడాయిల్‌+ ఎల్‌ఎన్‌జీ- ఎగుమతులు) 121.6 బిలియన్‌ డాలర్లుగా లెక్క తేలింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం 144.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దేశీయంగా క్రూడాయిల్‌ దిగుమతి తక్కువగా ఉన్నప్పటికీ.. అధిక రిఫైనరీ కెపాసిటీ కారణంగా డీజిల్‌ వంటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని