PM modi at RBI event: 10 ఏళ్లలో ఆర్‌బీఐ చర్యలు భేష్‌.. ప్రధాని మోదీ ప్రశంస

గడిచిన పదేళ్లలో చూసింది ట్రైలర్‌ మాత్రమేనని.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చేయాల్సింది చాలా ఉందని  ప్రధాని మోదీ అన్నారు. ఆర్‌బీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.

Updated : 01 Apr 2024 13:36 IST

PM Modi | ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై (RBI) ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు. గడిచిన 10 ఏళ్ల బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడంలో ఆర్‌బీఐ కీలక భూమిక పోషించిందని కొనియాడారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఏర్పాటై 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌బీఐ గవర్నర్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారకు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు.

‘‘2014లో ఆర్‌బీఐ 80వ వార్షికోత్సవానికి హాజరయ్యా. అప్పట్లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ట్విన్‌ బ్యాలెన్‌షీట్‌ సమస్య తీవ్రంగా వేధించింది. పారు బాకీలతో బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉండేవి. అప్పట్లో బ్యాంకింగ్‌ వ్యవస్థ భవిష్యత్‌పైనా ప్రశ్నలు తలెత్తాయి. అలాంటిది పదేళ్లలో చాలా మార్పు వచ్చింది. బ్యాంకుల బాగు కోసం మా ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్లను జొప్పించింది.

కొత్త ఆదాయపు పన్ను విధానంపై తప్పుడు సమాచారం.. కేంద్రం క్లారిటీ!

నాడు దిక్కుతోచని స్థితిలో ఉన్న బ్యాంకులు ఇవాళ లాభాల బాట పట్టాయి. రుణాల జారీలో కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. ఈ 10 ఏళ్లలో ఈ మార్పులు అంత సులువుగా ఏమీ జరగలేదు. మా ప్రభుత్వం, ఆర్‌బీఐ అనుసరించిన విధానాలే అందుకు కారణం. బ్యాకింగ్‌ వ్యవస్థ బాగు విషయంలో మా ఉద్దేశాలు స్పష్టంగా ఉండడంతో ఇవాళ ఈ పరిస్థితి సాధ్యమైంది. భవిష్యత్‌లోనూ ఆర్‌బీఐ భిన్నంగా ఆలోచించాలి. ఇందులో గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ది అందివేసిన చేయి’’ అని మోదీ కొనియాడారు.

స్వావలంబన అవసరం

రాబోయే పదేళ్లలో దేశం ఆర్థికంగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. అప్పుడే ఇతర దేశాల ప్రభావం మనపై పడదన్నారు. మూడోసారి తాము అధికారంలోకి వచ్చాక ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. ఈ పదేళ్లలో చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, భారత్‌ను ముందుకు తీసుకెళ్లడంలో చేయాల్సింది ఇంకా చాలా ఉందని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ ప్రభావంతో చాలా ఆర్థిక వ్యవస్థలు ఇబ్బంది పడితే.. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పిందని గుర్తు చేశారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్‌బీఐ బాగా పనిచేసిందని కితాబిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని