Piyush Goyal: 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌: పీయూష్ గోయల్‌

Eenadu icon
By Business News Team Published : 25 Jun 2025 12:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: 2027 నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ (Piyush Goyal) పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని సాధించే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం, వ్యాపార సంఘాలు, పరిశ్రమలు సహా 140 కోట్ల మంది భారతీయులు.. ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌ దార్శనికతతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. శక్తివంతమైన ఆర్థికవ్యవస్థగా మారేందుకు భారత్‌ సున్నితమైన సమస్యలు ఉన్న ప్రతిచోటా.. ప్రపంచదేశాలతో పోటీపడగలిగేలా తనను తాను మలుచుకుందని గోయల్‌ అన్నారు. నేడు భారత్‌ అంతర్జాతీయంగా అత్యున్నతస్థాయిలో ఉందని పేర్కొన్నారు. విదేశాలలో భారతీయ పౌరుల భద్రతకు ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతకు ఇటీవల కేంద్రప్రభుత్వం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధు’ ఉదాహరణ అని తెలిపారు. ఆపరేషన్‌ సింధు ద్వారా ఇరాన్‌, ఇజ్రాయెల్‌లలో చిక్కుకున్న భారతీయులను మోదీ ప్రభుత్వం సురక్షితంగా తమ స్వస్థలాలకు తీసుకువచ్చిందని అన్నారు. 

బలమైన స్థూల ఆర్థిక పునాదితో దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగా ఉందని గోయల్‌ అన్నారు. ఇప్పటివరకు లేనివిధంగా దేశంలో ద్రవ్యోల్బణం అత్యల్పంగా 3 శాతానికి తగ్గిందని తెలిపారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని అందుకోవడం కోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్‌పై దృష్టిసారించడం వంటి చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్‌ మార్కెట్‌.. రాబోయే దశాబ్దకాలంలో భారత్‌కు చాలా కీలకమన్నారు.

ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా (Fourth largest economy) అవతరించిందని ఇటీవల నీతిఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి 4.19 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.356 లక్షల కోట్ల)కు చేరుకుందని.. జపాన్‌ కంటే 4.187 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.35,600 కోట్లు) అధికంగా మన ఆర్థికవ్యవస్థ ఉందన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా గణాంకాలను ఆయన ఉదహరించారు. అమెరికా, చైనా, జర్మనీ తరవాత స్థానంలో మన దేశం ఉందని వివరించారు. ఇలాగే మనం ముందుకుసాగితే మరో మూడేళ్లలో భారత్‌ జర్మనీని దాటుకొని.. మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు