India-UK: ఎన్నికల ఎఫెక్ట్‌.. భారత్‌-యూకే వాణిజ్య చర్చలకు బ్రేక్‌..!

India-UK: భారత్‌-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది.

Published : 16 Mar 2024 11:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, బ్రిటన్‌ (India-UK) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాని (Free Trade Agreement)కి సంబంధించి తాజాగా జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. అయితే, ఈ ఒప్పందం ఇప్పుడప్పుడే ఖరారయ్యే అవకాశాలు కన్పించట్లేదు. ఎన్నికల (Elections) నేపథ్యంలో చర్చలకు తాత్కాలికంగా విరామమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటిష్ అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

మరికొద్ది రోజుల్లో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అటు బ్రిటన్‌ కూడా ఈ ఏడాదే సాధారణ ఎన్నికలకు వెళ్లనుంది. 2024 రెండో అర్ధభాగంలో అక్కడ ప్రధానిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘‘చర్చల నుంచి ఇరు వర్గాలూ వైదొలగడం లేదు. ఉమ్మడి ఆశయాలకు అనుగుణంగా ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు’’ అని బ్రిటిష్‌ అధికారి ఒకరు చెప్పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

పేటీఎమ్‌ వినియోగదార్లకు.. అవి తప్ప అన్ని సేవలూ

ఇటీవల ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, రిషి సునాక్‌ ఫోన్లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఉభయ పక్షాలకూ ప్రయోజనం చేకూర్చే ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ ఖరారు దిశగా సాగుతున్న పురోగతిని నేతలిద్దరూ ప్రశంసించారు. గత రెండేళ్లుగా దీనిపై 14 విడతల్లో చర్చలు జరిగాయి. ఎఫ్‌టీఏలో భాగంగా వస్తువులకు సుంకం మినహాయింపుతో పాటు ఐటీ, హెల్త్‌కేర్‌ రంగాల్లో ఎక్కువ అవకాశాలను భారత్‌ ఆశిస్తోంది. అదే సమయంలో స్కాచ్‌ విస్కీ, ఆటోమొబైల్స్‌, గొర్రె మాంసం, చాక్లెట్లు వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకంపై యూకే మినహాయింపులు కోరుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని