పేటీఎమ్‌ వినియోగదార్లకు.. అవి తప్ప అన్ని సేవలూ

మొబైల్‌, డీటీహెచ్‌ రీఛార్జిల వంటి అన్ని సేవలనూ తమ యాప్‌ వినియోగదార్లు కొనసాగించొచ్చని పేటీఎమ్‌ పేర్కొంది. పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వినియోగదార్లు మాత్రం తమ వాలెట్‌, బ్యాంకు ఖాతాలో ఎటువంటి నిధులనూ జమ చేయలేరు.

Published : 16 Mar 2024 01:24 IST

దిల్లీ: మొబైల్‌, డీటీహెచ్‌ రీఛార్జిల వంటి అన్ని సేవలనూ తమ యాప్‌ వినియోగదార్లు కొనసాగించొచ్చని పేటీఎమ్‌ పేర్కొంది. పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వినియోగదార్లు మాత్రం తమ వాలెట్‌, బ్యాంకు ఖాతాలో ఎటువంటి నిధులనూ జమ చేయలేరు. కానీ అందులోని నిల్వలు అయిపోయే వరకు వినియోగించుకోవచ్చు. ఈనెల 15 తరవాత పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతా/వాలెట్‌లో కొత్త డిపాజిట్లపై ఆర్‌బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

పేటీఎమ్‌ ఫాస్టాగ్‌ పరిస్థితి ఏమిటి?: వినియోగదార్లు తమ యాప్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయవచ్చని.. అలాగే ఇతర భాగస్వామ్య బ్యాంకుల ఫాస్టాగ్‌లు రీఛార్జి చేసుకోవచ్చని పేటీఎం తెలిపింది. ఇప్పటికే ఉన్న పేటీఎమ్‌ బ్యాంక్‌ ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ పూర్తయ్యే వరకు ఉపయోగించుకోవచ్చు.

ఇవన్నీ పనిచేస్తాయ్‌: పేటీఎమ్‌ యాప్‌లోని ఇతర అన్ని సేవలూ పనిచేస్తాయ్‌. సినిమాలు, ఈవెంట్లు, ప్రయాణ (మెట్రో, విమానం, రైలు, బస్సు) టికెట్ల కొనుగోళ్లు.. ఇలా అన్నీ పూర్తిగా పనిచేస్తాయి. మొబైల్‌ రీఛార్జి, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు(విద్యుత్‌, నీరు, గ్యాస్‌, ఇంటర్నెట్‌) చెల్లించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

యూపీఐ సేవలూ: పేటీఎమ్‌ యాప్‌ వినియోగదార్లు యూపీఐ సేవలనూ కొనసాగించొచ్చు. నాలుగు బ్యాంకుల(ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యెస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌)తో భాగస్వామ్యానికి ఎన్‌పీసీఐ అనుమతినివ్వడమే ఇందుకు నేపథ్యం. యూపీఐ లావాదేవీలకు పేటీఎమ్‌ ఒక థర్డ్‌ పార్టీ యాప్‌(టీపీఏపీ)గా పనిచేస్తుందన్నమాట. ప్రస్తుత జీపేటీఎమ్‌ హ్యాండిల్‌తో పాటు జీపీటీయెస్‌ హ్యాండిల్‌కు ఎన్‌పీసీఐ అనుమతినిచ్చింది. జీపీటీహెచ్‌డీఎఫ్‌సీ, జీపీటీఎస్‌బీఐలకూ ఆమోదం తెలిపినా.. ఇవి తక్షణం యాక్టివ్‌ కాలేదు. నీ సౌండ్‌బాక్సులు, కార్డ్‌ మెషీన్లు, క్యూఆర్‌ కోడ్‌లు పూర్తిగా పనిచేస్తాయనీ కంపెనీ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని