Elon musk: ‘ట్విటర్‌ బ్లూతో పైసా వసూల్‌..’.. మస్క్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రశంసలు!

Twitter Ads Revenue Scheme: ట్విటర్‌లో యాడ్‌ రెవెన్యూ షేరింగ్‌ మోడల్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మస్క్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Published : 09 Aug 2023 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇన్నాళ్లు ట్విటర్‌లో (ప్రస్తుతం X) చేపట్టిన మార్పుల విషయంలో ఎలాన్‌ మస్క్‌పై (Elon musk) అసహనం చేయని వారు లేరు. బ్లూ టిక్‌ తీసుకురావడం, లోగోలో పక్షి బొమ్మను తీసివేయడం వంటి చర్యలు ఆగ్రహానికి కారణమయ్యాయి. కంపెనీలో జరిగిన పరిణామాలూ పలువురికి ఆగ్రహం తెప్పించాయి. అలాంటి ఎలాన్‌ మస్క్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మస్క్‌.. నువ్వు మంచోడివి, గ్రేట్‌’ అంటూ తెగ పొగిడేస్తున్నారు. అయితే, కొత్తగా తీసుకొచ్చిన యాడ్‌ రెవెన్యూ మోడలే (Ads Revenue) ఇందుకు కారణం. యాడ్‌ రెవెన్యూ షేరింగ్‌ కింద తమకు ట్విటర్‌ డబ్బులు వేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబంధిత స్క్రీన్‌ షాట్లను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

ట్విటర్‌లో వెరిఫై అయిన వారికి యాడ్‌ రెవెన్యూ షేరింగ్‌ కింద ట్విటర్‌ డబ్బులు జమ చేస్తోంది. గత మూడు నెలలుగా నెలకు 5 మిలియన్‌ ఇంప్రెషన్లను పొందిన వారు రెవెన్యూ షేరింగ్‌కు అర్హులు. అలాగే స్ట్రైప్‌ పేమెంట్‌ అకౌంట్‌ కలిగి ఉండాలి. ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఉండాలి. అలాంటి వారికి వారు పెట్టిన పోస్టులకు వచ్చే రిప్లయ్‌ల మధ్యలో వచ్చే యాడ్స్‌కు గానూ ట్విటర్‌ ఈ చెల్లింపులు చేస్తోంది. దీంతో తమకు ఇంత మొత్తం వచ్చిందంటూ ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.

రాజస్థాన్‌ అందాలు వీక్షించాలనుకుంటున్నారా..?.. IRCTC ప్యాకేజీ వివరాలివే..

ట్విటర్‌లో గబ్బర్‌ సింగ్‌గా పేరొందిన జోరో కో-ఫౌండర్‌ అభిషేక్‌ ఆస్తానా తాజాగా తనకు ట్విటర్‌ నుంచి రూ.2.01 లక్షలు వచ్చినట్లు పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. ‘బ్లూ టిక్‌ పైసా వసూల్‌’ అని పేర్కొన్నాడు. మిథున్‌ అనే మరో ఇన్‌ఫ్లూయెన్సర్‌ సైతం తనకు ఏకంగా మూడున్నర లక్షలు వచ్చాయంటూ తెలిపాడు. భారత్‌కు చెందిన వారు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారూ ఇందులో ఉన్నారు. కంటెంట్‌ క్రియేటర్లను పెద్ద ఎత్తున ఈ వేదికపైకి రప్పించేందుకే ట్విటర్‌ ప్రయత్నంలో ఇది భాగమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ‘పెద్ద ఇన్‌ఫ్లూయెన్సర్లకు డబ్బులు జమ చేసి మరింత మందిని ట్విటర్‌ బ్లూ కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తోంది. వీరిని సేల్స్‌మన్‌లాగా వాడుకుంటోంది’’ అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని