IRCTC package: రాజస్థాన్‌ అందాలు వీక్షించాలనుకుంటున్నారా..?.. IRCTC ప్యాకేజీ వివరాలివే..

IRCTC tour package: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది. రాజస్థాన్‌లో ప్రసిద్ధ కట్టడాలను వీక్షించే అవకాశం ఈ ప్యాకేజీ ద్వారా కల్పిస్తోంది.

Updated : 09 Aug 2023 12:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ అనగానే మనకు గుర్తొచ్చేవి.. రాచరికానికి దర్పం పట్టే కోటలు, ప్యాలెస్‌లు, సరస్సులు. ప్రముఖుల వివాహాలూ ఎక్కువగా ఇక్కడే జరుగుతుంటాయి. అలాంటి ప్రదేశాలను వీక్షించాలనుకునే వారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అవకాశం కల్పిస్తోంది. విమాన ప్రయాణంతో పాటు అన్ని వసతులతో ఉండే విధంగా ‘రాయల్‌ రాజస్థాన్‌’ (ROYAL RAJASTHAN) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌తో పాటూ ఉదయ్‌పుర్‌, జోధ్‌పుర్‌ వంటి నగరాలను సందర్శించొచ్చు. ఐదు రాత్రులు, ఆరు పగళ్లతో ఈ టూర్‌ ఉంటుంది. సెప్టెంబర్‌ 10న ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

విమాన ప్రయాణం ఇలా..

  • హైదరాబాద్‌ నుంచి ఉదయం 11:30 గంటలకు విమానం (6E 913)  బయల్దేరుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు జైపుర్ విమానాశ్రయం చేరుతారు. హోటల్‌లో బస ఉంటుంది. మధ్యాహ్నం భోజనం ముగించుకొని అమేర్‌ ఫోర్ట్‌ చూడటానికి వెళ్తారు. తిరిగి రాత్రి అదే హోటల్‌లో భోజనం, రాత్రి బస ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం అల్పాహారం తీసుకున్నాక జైపుర్‌ సిటీ ప్యాలెస్‌, జంతర్‌ మంతర్‌ చూడటానికి తీసుకెళ్తారు. ఆ రోజు సాయంత్రం అక్కడే షాపింగ్‌ చూసుకొని తిరిగి హోటల్‌ చేరుకోవాల్సి ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం జైపుర్‌ నుంచి పుష్కర్‌కు చేరుకుంటారు. అక్కడ బ్రహ్మ ఆలయాన్ని సందర్శించి మధ్యాహ్నానికి ఉదయ్‌పుర్‌కు పయనమవుతారు. ఆ రోజు రాత్రి ఉదయపుర్‌లో ఏర్పాటు చేసిన హోటల్‌లో బస ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం అల్పాహారం స్వీకరించాక సిటీ ప్యాలెస్‌ అందాలు వీక్షించి సహేలియోన్‌ కీ బరీ చూస్తారు. ఇక  సాయంత్రం పిచోలా లేక్‌ చూడటానికి వెళ్తారు. సాయంత్రం యాత్రికుల ఇష్టం మేరకు షాపింగ్‌కు వెళ్లొచ్చు. ఆ రోజు రాత్రి ఉదయ్‌పుర్‌లోనే బస ఉంటుంది.
  • ఐదో రోజు టిఫిన్‌ చేశాక జోధ్‌పుర్‌కు బయల్దేరుతారు. మధ్యాహ్నం జోధ్‌పుర్‌  చేరుకొని ఉమైద్ భవన్ ప్యాలెస్ అందాలు వీక్షిస్తారు. జోధ్‌పుర్‌లో ముందుగా ఏర్పాటు చేసిన హోటట్‌లోనే బస ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం అల్పాహారం తీసుకున్నాక మెహ్రాన్‌ఘర్ కోటను సందర్శిస్తారు. సాయంత్రం 4:55 గంటలకు జోధ్‌పుర్‌ ఎయిర్‌పోర్ట్ చేరుకొని విమానంలో (6E 6592) హైదరాబాద్‌కు పయనమవుతారు. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో మీ ప్రయాణం ముగుస్తుంది.

ఇవి ప్యాకేజీలో భాగమే

  • హైదరాబాద్‌- జైపూర్‌/ జోధ్‌పూర్‌- హైదరాబాద్‌ విమాన టికెట్లు
  • జైపుర్‌, ఉదయ్‌పుర్‌, జోధ్‌పుర్‌లో హోటల్‌ బస
  • ఐదు రోజుల పాటు ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనాలు ప్యాకేజీలో భాగమే
  • పర్యాటక ప్రదేశాల వీక్షణానికి ఏసీ బస్సును ఐఆర్‌సీటీసీనే ఏర్పాటు చేస్తుంది.
  • ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం ఉంటుంది.
  • ఐఆర్‌సీటీసీ టూర్‌ ఎస్కార్ట్‌ అందుబాటులో ఉంటారు.

 రైల్లో లోయర్‌ బెర్త్‌ కావాలా? ఈసారి ఇలా చేయండి..

ఇవి గుర్తుంచుకోండి..

  • టూర్‌ సమయంలో మధ్యాహ్నం భోజన బాధ్యత యాత్రికులదే.
  • హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి తిరుగు ప్రయాణానికీ యాత్రికులే ఏర్పాట్లు చేసుకోవాలి.
  • విమానంలో ఆహారానికి యాత్రికులే చెల్లించాలి. 
  •  చూడదగిన ప్రదేశాల్లో టికెట్ల ఖర్చు ప్రయాణికులే భరించాలి.
  • 75 ఏళ్లు పైబడిన వారు ప్రయాణించాలంటే కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఎస్కార్ట్‌గా నియమించుకోవాలి.
  • వాతావరణం లేదా ఎయిర్‌లైన్స్‌ షెడ్యూళ్ల కారణంగా విమాన సమయం మారొచ్చు.

ప్యాకేజ్‌ ఛార్జీలు.. (ఒక్కొక్కరికీ)

  • రూమ్‌లో సింగిల్‌ షేరింగ్‌ కావాలంటే రూ.37,750
  • ట్విన్‌ షేరింగ్‌ అయితే రూ.30,450
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.28,900
  • 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.25,200. విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే రూ.20,100 చెల్లించాలి.
  • 2-4 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.17,900 చెల్లించాలి.
  • ఒకవేళ ఏదైనా కారణంతో 21 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే టికెట్‌ మొత్తం ధరలో 30 శాతం మినహాయిస్తారు. అదే 21 నుంచి 15 రోజుల్లో అయితే 55 శాతం, 14 నుంచి 8 రోజుల్లో అయితే 80 శాతం డబ్బును మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

ప్రయాణ టికెట్‌ బుకింగ్‌, ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాల కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని